
కరోనా మహమ్మారితో ఇన్నాళ్లు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మందుబాబుల ఇష్టారాజ్యంగా మారింది. అలా డ్రింక్ చేసి డ్రైవ్ చేసి చాలా మంది ప్రమాదాల బారిన పడిన వారినీ చూశాం. ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరం సంబురాలు రాబోతున్నాయి. దీంతో మహానగరం పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
నగరంలోని మందుబాబుల తిక్క కుదిర్చేందుకు సిద్ధపడిపోయారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఈ రోజు నుంచి పునఃప్రారంభిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొంతకాలంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో వారం రోజుల ముందు నుంచే ఈ ప్రత్యేక తనిఖీలు షురూ చేయనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ నిర్ధారించారు. నేటి నుంచి ప్రతిరోజూ నగరంలో డ్రంక్ డ్రైవ్ టెస్టులు ఉంటాయని చెప్పారు. ఇక రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే.
కాగా.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫేస్ షీల్డ్‌లు ధరించి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. బ్రీత్ అనలైజర్‌కు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసి, భౌతిక దూరం పాటిస్తూ ఈ టెస్టులు నిర్వహించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగి నడుపుతూ పట్టుబడితే బండిని సీజ్ చేయడంతోపాటు భారీగా జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శృతి మించితే జైలు శిక్షలు కూడా పడతాయని చెబుతున్నారు.
పోలీసుల ప్రకటనతో మందుబాబులు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కరోనాతో అందరం ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోతే పోలీసులు సీరియస్‌గా పరిగణించబోతున్నారు. వారికి దొరకకుండా కొత్త సంవత్సరం వేడుకలను ఎంజాయ్ చేద్దాం.