https://oktelugu.com/

Sivananda Reddy: తెలంగాణ పోలీసులు రాగానే.. ఏపీ టిడిపి నేత ఎందుకు పారిపోయారు?

టిడిపి నంద్యాల లోక్ సభ ఇన్ ఛార్జ్ గా మాండ్ర శివానందరెడ్డి కొనసాగుతున్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 1, 2024 / 04:24 PM IST

    Mandra Sivananda Reddy Land Scam In Telangana

    Follow us on

    Sivananda Reddy: ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో హడావిడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించాయి. జోరుగా ప్రచారం చేస్తున్నాయి. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇలా వేడెక్కిన రాజకీయ వాతావరణాన్ని.. తెలంగాణ పోలీసులు మరింత వేడెక్కించారు. అదేంటి ఏపీ ఎన్నికల్లో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఎందుకు? అనే ప్రశ్న మీకు తలెత్తవచ్చు. ఇంతకీ ఏపీలో తెలంగాణ పోలీసులు ఎందుకు ప్రవేశించారు? దాని వెనుక కారణమేంటి? తెలంగాణ పోలీసులు రాగానే ఆ ఏపీ టిడిపి నేత ఎందుకు పారిపోయారు? ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.

    టిడిపి నంద్యాల లోక్ సభ ఇన్ ఛార్జ్ గా మాండ్ర శివానందరెడ్డి కొనసాగుతున్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కూడా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. అయితే అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిసిఎస్ పోలీసులు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరుకు చేరుకున్నారు. ఆ గ్రామంలో శివానందరెడ్డి ప్రచారం చేస్తున్నారు.. ఆయనతో కొంతసేపు మాట్లాడి భూ వివాదం కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా శివానందరెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కూడా గతంలో ఐపీఎస్ అధికారిగా పనిచేయడంతో.. అరెస్టుకు ముందు నోటీసు ఇవ్వాలని కోరారు. ఆయన కోరిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నోటీసులు తయారు చేస్తున్నారు. ఈలోగానే శివానందరెడ్డి కారు ఎక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ దొరకకుండా తప్పించుకుని వెళ్లిపోయారు. ఇదే సమయంలో తెలంగాణ పోలీసులు వెంబడించకుండా శివానందరెడ్డి అనుచరులు గేట్లకు తాళాలు వేసినట్టు ప్రచారం జరుగుతోంది.

    హైదరాబాదులోని భూ వివాదంలో శివానందరెడ్డి తల దూర్చారని అక్కడి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు అందింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు 194/ 2022 నెంబర్ తో ఒక కేసు కూడా ఫైల్ చేశారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం నంద్యాల జిల్లాలోని అల్లూరుకు వెళ్లారు. పోలీసుల కళ్ళు గప్పి శివానందరెడ్డి తన వాహనంలో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఎటువంటి అడుగులు వేస్తారు? శివానందరెడ్డిని అరెస్టు చేస్తారా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు శివానందరెడ్డి ఎపిసోడ్ తో అధికార వైసిపి విమర్శలు మొదలుపెట్టింది. భూ వివాదాలకు పాల్పడిన నేతలకు టిడిపి అధినేత చంద్రబాబు టికెట్లు ఇచ్చారంటూ ఎద్దేవా చేస్తోంది.