Mahesh Kumar Goud: రాహుల్‌గాంధీ చేపట్టిన ఓట్ చోరీ ఉద్యమాన్ని తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. దీనిని ఉద్యమంగా చేపడుతోంది. నేతలు ఎక్కడికి వెళ్లినా ఇదే విషయాన్ని పదేపదే ప్రచారం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర చొప్పదండిలో సాగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ నేతలు ఓట్ చోరీ అంశాన్నే ప్రస్తావించారు. బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన ఆరోపణ చేశారు. ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను టార్గెట్ చేశారు. ఈ ఆరోపణలు రాజకీయ వివాదానికి దారితీశాయి.
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
ఓట్ చోరీ ప్రమోషన్..
ఓట్ చోరీపై ఇప్పటికే రాహుల్‌గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బిహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు. అక్కడ ఓట్ల తొలగింపును తప్పుపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి ఈసీ సహకరించిందని ఆరోపిస్తున్నారు. బీజేపీ, ఈసీ కుమ్మక్కయ్యాయంటున్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ నేతలు కూడా ఓట్ చోరీని ప్రమోట్ చేస్తున్నారు. జనహిత జనహిత పాదయాత్ర సందర్భంగా టీపీసీసీ చీఫ్ తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపును తప్పుపట్టారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వెల్లడించిన ఓటరు జాబితా ఆధారంగా, కర్ణాటకలోని మహదేవపురలో లక్షకు పైగా దొంగ ఓట్లు చేర్చబడ్డాయని, ఒకే చిరునామాకు వందల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని, గుర్తింపు సంఖ్యలు వివిధ రాష్ట్రాల్లో ఉపయోగించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్ల గెలవడానికి కూడా ఓట్ చోరీ కారణమన్నారు. దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు.
టార్గెట్ బండి సంజయ్..
మహేశ్‌గౌడ్ కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను టార్గెట్ చేశారు. ఆయన బీసీ నాయకుడిగా పరిగణించబడే అర్హతపై ప్రశ్నలు లేవనెత్తారు. బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయన బీసీల 42% రిజర్వేషన్‌పై మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. సంజయ్ బీసీ కాదని దేశ్‌ముఖ్ అని సంచలన ఆరోపణ చేశారు.
ఆధారాలు ఏమిటి?
మహేశ్‌గౌడ్ ఆరోపణలు కేవలం రాహుల్ గాంధీ వెల్లడించిన ఓటరు జాబితా గురించి ప్రస్తావించినప్పటికీ, ఈ జాబితా విశ్వసనీయత లేదా దానిని ధ్రువీకరించే స్వతంత్ర ఆధారాల గురించి స్పష్టమైన సమాచారం లేదు. గతంలో బండి సంజయ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి, కానీ తెలంగాణ హైకోర్టు ఆ కేసులను కొట్టివేసింది, ఎందుకంటే తగిన సాక్ష్యాలు లేవని న్యాయస్థానం భావించింది. ఈ సందర్భంలో, దొంగ ఓట్ల ఆరోపణలకు సంబంధించి ఎన్నికల కమిషన్ లేదా ఇతర అధికారిక సంస్థల నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేదు. ఈ ఆరోపణలు రాజకీయ ఎత్తుగడలుగానే కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ వ్యూహం
తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ ఆరోపణల ద్వారా బీజేపీ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. బీసీ ఓటర్లు, మైనారిటీ సమాజాలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, బండి సంజయ్‌ను బీసీ నాయకుడిగా ప్రశ్నించడం, బీజేపీని కులం, మతం పేరుతో ఓట్లు అడిగే పార్టీగా చిత్రీకరించడం వంటి వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంలో భాగమే. బీజేపీ ఎంపీలంతా దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించడం ద్వారా బీజేపీని బద్నాం చేసే వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అదే జరిగిం ఉంటే.. మిగిలిన సీట్లలో కూడా బీజేపీ గెలిచేది కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.