Telugu Print Media : ఐటి, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, షిప్పింగ్ వంటి విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు భారీగానే వేతనాలు ఉంటాయి. కానీ మీడియాలో పనిచేసే ఉద్యోగులకు ఈ స్థాయిలో ఉండవు. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో దిగువ స్థాయిలో పనిచేసే సబ్ ఎడిటర్లకు, స్టాఫ్ రిపోర్టర్లకు గొప్ప జీతాలు ఉండవు. ఈ విభాగంలో స్టాఫ్ రిపోర్టర్లను కాస్త మినహాయిస్తే.. సాయంత్రం నుంచి అర్ధరాత్రి పూట దాకా పనిచేసే సబ్ ఎడిటర్ల చాకిరి మామూలుగా ఉండదు. అర్ధరాత్రి దాకా పనిచేయాలి. ఆ సమయంలో ఏదైనా జరిగితే రిపోర్టర్ అవతారం కూడా అతడే ఎత్తాలి.. మొత్తంగా చూస్తే తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. అలాంటి ఉద్యోగం చేస్తున్న సబ్ ఎడిటర్లను ఆ పత్రికా యాజమాన్యం చేస్తున్న మోసం అంతా ఇంతా కాదు. కరోనా సమయంలో అడ్డగోలుగా సబ్ ఎడిటర్లను తొలగించిన ఆ యాజమాన్యం.. స్టాప్ రిపోర్టర్ల విషయంలో మాత్రం ఉదారత చూపించింది. అయితే ఆ సబ్ ఎడిటర్ల కు ఇచ్చే వేతనాలు అంతంత మాత్రమే. అయినప్పటికీ ఆ వేతనంలో వెల్ఫేర్ ఫండ్ పేరుతో ఆ పత్రికా యాజమాన్యం జీతాల్లో కోత విధిస్తుంది. హాజరు నమోదు విషయంలోనూ బయోమెట్రిక్ విధానాన్ని అవలంబిస్తుంది.
గ్రేస్ పీరియడ్ కూడా తగ్గించింది..
గతంలో గ్రేస్ పీరియడ్ 350 నిమిషాల వరకు ఉండేది. అదే కొంతకాలం నుంచి దాన్ని కూడా రద్దు చేసింది. సబ్ ఎడిటర్ ఆఫీస్ కు వచ్చే క్రమంలో ఐదు పది నిమిషాలు ఆలస్యమైనా సరే వేతనాలలో కోత విధిస్తారు.. ఓవర్ టైం చేయాల్సి వచ్చినప్పుడు రూపాయి కూడా ఎక్కువగా ఇవ్వరు. దీనినే ఆ పత్రికా యజమాన్యం గొప్పగా చెప్పుకుంటుంది. పైగా ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతినెల వసూలు చేసిన వెల్ఫేర్ ఫండ్ ను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఒక్క ఉద్యోగికి ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఎవరైనా ఉద్యోగి రుణం తీసుకోవాలంటే దానికి సవాలక్ష నిబంధనలు. గతంలో ఇదే విషయంపై ఓ సబ్ ఎడిటర్ మేనేజ్మెంట్ ని ప్రశ్నిస్తే అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. వాస్తవానికి తెలుగు ప్రింట్ మీడియాలో మిగతా పత్రికలు కొంతలో కొంత మెరుగైన వేతనాలు ఇస్తున్నాయి.. ఉద్యోగులకు ఒక భరోసా కల్పిస్తున్నాయి. కానీ ఈ పత్రిక మాత్రం మొదటినుంచి అంతే. వేతనం విషయంలోనూ పిసినారి వ్యవహారాన్ని అవలంబిస్తుంది. ఉద్యోగి కల్పించే సౌకర్యాల విషయంలోనూ అదే అధమ స్థాయిని అనుసరిస్తుంది. కానీ పైకి మాత్రం నీతి వాక్యాలు చెబుతుంది. విలువలు, సామాజిక బాధ్యతలు అంటూ లెక్చర్లు ఇస్తుంది.
కోతలే ఎక్కువ
ఆ పత్రికలో పనిచేసే స్టాఫ్ రిపోర్టర్లకు, బ్యూరో చీఫ్ లకు ఇన్ పంచ్ (ఆఫీసులోకి వస్తున్నప్పుడు బయోమెట్రిక్ లో ఫింగర్ ప్రింట్ పెట్టడం) మాత్రమే ఉంటుంది.. కానీ ఎడిటోరియల్ లో పనిచేసే సబ్ ఎడిటర్లకు కచ్చితంగా ఇన్ పంచ్, ఔట్ పంచ్ ఉండాల్సిందే. ఇందులో ఒక్క నిమిషం కూడా ఆలస్యమైనా వేతనం కట్ అవుతుంది. దీనికి తోడు వెల్ఫేర్ ఫండ్ పేరుతో అదనపు కోత. అంతటి కరోనా పీడ దినాలలో ఒక్క రూపాయి కూడా వెల్ఫేర్ ఫండ్ నుంచి ఆ యాజమాన్యం సబ్ ఎడిటర్లకు ఇవ్వలేదు. కోవిడ్ సమయంలో అడ్డగోలుగా సబ్ ఎడిటర్లను తొలగించినప్పుడు ఒక్క రూపాయి కూడా వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇవ్వలేదు. మిగతా పత్రికలు సబ్ ఎడిటర్లను ఉద్యోగం నుంచి తొలగించినప్పటికీ వారికి మూడు నెలల వేతనం ఇచ్చాయి. గోల్డెన్ హ్యాండ్ షేక్ కింద సెటిల్మెంట్ కూడా కల్పించాయి. కానీ ఈ పత్రిక మాత్రం నిర్మోహమాటంగా బయటికి గెంటేసింది. మేనేజ్మెంట్ ఇచ్చిన షాక్ కు చాలామంది కోలుకోలేదు. వారు స్థిమితపడి.. మళ్లీ స్థిరపడే వరకు చాలా సమయమే పట్టింది. కాని వారి శక్తిని, యుక్తిని వాడుకున్న మేనేజ్మెంట్ మాత్రం వందల కోట్లకు ఎదిగింది. కానీ ఇక్కడే నూరు గొడ్లను తిన్న రాబంధు ఒక గాలివానకు చస్తుంది కదా! అనే మాట గుర్తుకువస్తుంది.. అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత. అయితే ఇదే విషయాన్ని రాస్తే ఆ సంస్థలో పనిచేస్తున్న పెద్ద తలకాయలకు “కామెడీ” లాగా అనిపిస్తుంది.