HomeతెలంగాణLok Sabha Election Results 2024: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ సత్తా.. బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతు

Lok Sabha Election Results 2024: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ సత్తా.. బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతు

Lok Sabha Election Results 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెరిసమానంగా సీట్లు పంచుకున్నాయి. మొత్తం 17 స్థానాలకు కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 సీట్లు రాగా, ఎంఐఎం హైదరాబాద్‌ను నిలబెట్టుకుంది. ఇక తెలంగాణలో పదేళ్లు అధికారంలోఉన్న బీఆర్‌ఎస్‌ ఈసారి ఖాతా తెరవలేదు.

కాంగ్రెస్‌ ఖాతాలో ఇవీ..
కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్, జహీరాబాద్, భువనగిరి, నాగర్‌కర్నూల్, పెద్దపల్లిలో విజయం సాధించింది.

బీజేపీ ఖాతాలో..
ఇక భారతీయ జనతాపార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ సీట్లను సొంతం చేసుకుంది.

అత్యధిక మెజారిటీ..
ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీని జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి సాధించి చరిత్ర సృష్టించాడు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై 5.51 లక్షల మెజారిటీ సాధించాడు. ఇక పది మంది ఎంపీలు లక్ష ఓట్లకుపైగా మెజారిటీ సాధించారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ. 2011లో కడప లోక్‌సభ ఉప ఎన్నికలో 5.43 లక్షల మెజార్టీతో వైఎస్‌ జగన్‌ గెలవగా, అంతకుమించిన మెజార్టీతో రఘువీర్‌ విజయం సాధించడం విశేషం. మహబూబ్‌నగర్‌లో డీకే. అరుణ అత్యల్ప మెజారిటీతో గెలిచారు.

మెజారిటీ వీరులు..
ఇక ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాం రెడ్డికి 4.67 లక్షల మెజారిటీ వచ్చింది. ఆయన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్‌ నేత నామా నాగేశ్వరరావుపై ఈ మెజారిటీ సాధించారు.

– మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా 3.8 లక్షల భారీ మెజారిటీ సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిని చిత్తు చేశారు.

– మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ తన సమీప ప్రత్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవితపై 3.44 లక్షల మెజారిటీతో విజయం సాధించారు.

– ఇక వరగంల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య కూడా 2 లక్షల పైచిలుకు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌పై విజయం సాధించింది.

– కరీంనగర్‌ లోక్‌సభ సీటు బండి సంజయ్‌ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నేత వేలిచాల రాజేందర్‌ రావుపై 2.2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.

– భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి డా.బూర నర్సయ్య గౌడ్‌పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు.

– పెద్దపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌పై 1.31 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

– నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ తన సీటును పదిలపరుచుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్ రెడ్డిపై లక్ష ఓట్లకు పైగా మెజార్టీ సాధించి రెండోసారి జయకేతనం ఎగురవేశారు.

– నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌పై 94 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు దాదాపు 3.2 లక్షల ఓట్లు వచ్చాయి.

– ఆదిలాబాద్‌ లోక్‌సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి నగేష్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణపై 92 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.

– జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్షెట్కార్‌ తన ప్రత్యర్థి, బీజేపీ నేత బీబీ.పాటిల్‌పై 47 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.

– సికింద్రాబాద్‌ స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌పై దాదాపు 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

– మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నేత నీలం మధుపై 35 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

– చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డిపై దాదాపు 1.6 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు.

– హైదరాబాద్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ 3.25 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఒవైసీకి 6.5 లక్షలకు పైగా ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి మాధవీ లతకు 3.20 లక్షలు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 62 వేలు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 18 వేల చొప్పున ఓట్లు పోలయ్యాయి.

– మహబూబ్‌నగర్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిపై కేవలం 3,600 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఖతా తెరవని బీఆర్‌ఎస్‌..
ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ చాలా ఏళ్ల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. పోటీ చేసిన 17 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. చాలాచోట్ల మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇది ఆ పార్టీకి ఘోర పరాభవమే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version