Vulture : ఆ రాబందు అందుకే వచ్చిందా? ఆ తర్వాతే నక్సల్స్ హతమయ్యారా?

కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి ఒక రాబందు వచ్చింది. దాని కాళ్లకు జిపిఎస్ ట్రాకర్, ఒక కెమెరా ఉన్నాయి. అది చాలా రోజులుగా ఆ ప్రాంతంలో సంచరించింది. సరైన ఆహారం లేక నీరసానికి గురైంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 7, 2024 5:04 pm

Vulture

Follow us on

Vulture : ఆ పక్షిని చర్ల మండలంలోని ఓ పాఠశాల దగ్గర స్థానికులు గుర్తించారు. వెంటనే దానికి కోడి మాంసం పెట్టారు. కాస్త ఆహారం అందించారు. ఆ తర్వాత ఆ రాబందును అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని.. తమ పర్యవేక్షణలో ఉంచారు. ఆ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నక్సల్స్ పై కేంద్ర బలగాలు విరుచుకుపడ్డాయి. చరిత్రలో తొలిసారిగా మావోయిస్టులను హతమార్చాయి. దట్టమైన అడవిలో ఓ సురక్షిత ప్రాంతంలో మావోయిస్టులు తల దాచుకున్నారు. అప్పటికే భారీగా వర్షం కురుస్తోంది. ఆ ప్రాంతంలో సెల్ఫోన్ సిగ్నల్స్ ఉండవు. కనీసం వాహనాలు వెళ్లడానికి సరైన దారి కూడా ఉండదు. అలాంటి ప్రాంతంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మావోయిస్టులకు పారిపోయే అవకాశం ఇవ్వకుండా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలోని దులి తులి అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటన జరగడానికి ముందు చర్ల మండలంలోని ఏకలవ్య పాఠశాల నిర్మాణ ప్రాంతానికి ఒక రాబందు వచ్చింది. దాని కాళ్లకు కెమెరా, జిపిఎస్ ట్రాకర్ ఉన్నాయి. దాని ద్వారానే పోలీసులు మావోయిస్టుల జాడ పసిగట్టాయని మానవ హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అప్పట్లో రాబందు ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చర్లలో సంచరిస్తున్న సమయంలో అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత దానిని గిరిజనులకు అప్పగించారు. గిరిజనులు దాన్ని విడిచిపెట్టారు. ఆ పక్షిని పట్టుకోడానికి అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ రాబందు మధ్యప్రదేశ్లోని పెన్నా టైగర్ జోన్ లోని వల్చర్ పాయింట్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఆ రాబందు ఏం చేసిందంటే…

సాధారణంగా రాబందు మృతదేహాల కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటుంది. మృతదేహం దొరికితే అది ఆహారం సేకరిస్తూ ఉంటుంది. కానీ రాబందు చర్ల లోని ఏకలవ్య పాఠశాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతం వద్దే ఉండడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మానవ హక్కుల సంఘం నాయకులు చెబుతున్నారు. మావోయిస్టుల జాడ పసిగట్టడానికే భద్రత దళాలు ఆ రాబందుకు కెమెరా, జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేశారని పౌరహక్కుల సంఘాల నాయకులు అనుమానిస్తున్నారు. చర్ల మండలంలో రాబందు ప్రత్యక్షం కావడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే ఆ రాబందు ఫోటోను పోలీసులు, పౌర హక్కుల సంఘాల నాయకులు జాగ్రత్తగా పరిశీలించడంతో అనేక విషయాలు తెరపైకి వచ్చాయి. ఇక దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు జల్లుల పడుతున్నాయి. గతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్ ల వల్ల కేంద్ర బలగాలు భారీగా నష్టపోయాయి. అయితే ఈసారి మావోయిస్టుల ట్రాప్ లో పడకుండా సరికొత్త విధానాలను కేంద్ర బలగాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. డ్రోన్ ల ద్వారా అడవుల్లో మావోయిస్టుల కదలికలను పసిగడుతున్నాయి. ఇక తాజా ఎన్ కౌంటర్ ద్వారా మావోయిస్టులు భయపడిపోతున్నారు. అయితే మావోయిస్టుల వద్ద సరైన సమాచార వ్యవస్థ లేదు. గూడచార వనరులు కూడా లేవు. అందువల్లే ఇటీవలి ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. గడచిన 11 రోజుల్లో ఇది మూడవ ఎన్కౌంటర్ కావడం విశేషం. సెప్టెంబర్ 24న కూడా సుకుమార్ జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. అయితే వారి మృతదేహాలను సహచర మావోయిస్టులు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది.

పహారా కాసినప్పటికీ..

వాస్తవానికి మావోయిస్టులు అడవుల్లో సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు.. ముప్పును ముందే పసిగడతారు. అయితే భారీగా వర్షం కురవడంతో పర్వతం మీద ఆగారని తెలుస్తోంది.. వర్షం తగ్గే వరకు అక్కడే ఉన్నారని సమాచారం. అంతటి వర్షం కురుస్తున్నప్పటికీ మావోయిస్టులు పహారా విషయంలో జాగ్రత్తగా ఉంటారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని సైతం పసిగడతారు. అయితే 10 కిలోమీటర్ల చిత్తడి నేలలు విస్తరించిన ప్రాంతంలో 1500 మందికి పైగా బలగాలు అందులోకి ప్రవేశించాయంటే.. పకడ్బందీ సమాచారంతోనే వారు అక్కడికి వెళ్లి ఉంటారని పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సమాచారాన్ని ముందుగానే పసిగట్టి భద్రతా దళాలకు అందించడంతో.. ఈ ఆపరేషన్ జరిగిందని తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో ఆ రాబందు కూడా భాగస్వామిగా నిలిచిందని పౌర హక్కుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.