Dharani portal land scam: కాళేశ్వరం పెద్ద స్కామని.. అందులో వేలకోట్ల అక్రమాలు జరిగాయని రేవంత్ నుంచి మొదలు పెడితే ఉత్తంకుమార్ రెడ్డి వరకు ఆరోపిస్తుంటారు. దాని తర్వాత గొర్రెలు.. ఫార్ములా ఈ రేస్ కుంభకోణాలు ఉంటాయని అంటుంటారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలు అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ధరణి గురించి గులాబీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. తెలంగాణ భూ రికార్డులు మొత్తం డిజిటలైజ్ చేసామని.. వాటిని సరికొత్తగా మార్చామని వివరించారు. కానీ ఆ ధరణి పెద్ద మోసమని.. అందులోనే పెద్ద వ్యవహారం ఉందని అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికీ కూడా ధరణి పాపాలు తెలంగాణ రైతుల ఉసురు తీసుకుంటూనే ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఒక కీలక విషయం బయటకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో ధరణి రాక ముందుకు పట్టా భూములు 1.30 కోట్ల ఎకరాల వరకు ఉండేవి. ధరణి వచ్చిన తర్వాత ఏకంగా 25 లక్షల ఎకరాలకు పట్టా భూములు పెరిగాయి. ఫలితంగా 1.55 కోట్ల ఎకరాలకు పట్టా భూములు పెరిగిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, వివాదాస్పద, వక్ఫ్ భూములు మాయమయ్యాయి. ధరణిలో భూములు మాయమైన జిల్లాల జాబితాలో రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలలో అత్యధికంగా భూములు మాయమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాలలో భూముల ధరలు అధికంగా ఉండడంతోనే మాయమైనట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాలలో కలెక్టర్లు నోటిఫై చేయడానికి నిరాకరించిన భూములను కూడా టీజీటీఎస్ ద్వారా తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ను ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించింది. గత సర్కార్ పెద్దలు, చీఫ్ సెక్రటరీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే భూములలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు భూముల నిర్వహణకు సంబంధించి చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే టెర్రా సిస్ అనే సంస్థ ఈ వ్యవహారాన్ని అధికారులకు చెప్పింది. మార్చిన భూములకు సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. కాళేశ్వరం కేసును ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలో పెట్టింది రేవంత్ ప్రభుత్వం. ఇంకా కొన్ని కేసులను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వడానికి రెడీగా ఉంది. అసలు గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాల కంటే అతి పెద్ద మాయాజాలం ధరణి. ఇన్ని వివరాలు తెలిసాయి కాబట్టి రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా గులాబీ నేతలను బయటికి లాగుతుందా.. కటకటాల వెనక్కి పంపుతుందా.. అర్హులైన వారికి న్యాయం చేస్తుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.