Duvvada Srinivas key supporter: దువ్వాడ శ్రీనివాస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారా? ఆయనకు పక్కా సమాచారం ఉందా? సస్పెన్షన్ అనేది తాత్కాలికమేనా? ఆ విషయాన్ని జగన్ స్వయంగా దువ్వాడ శ్రీనివాస్ తో చెప్పారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఒకవైపు దివ్వెల మాధురితో కలిసి వ్యాపారాలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. తనను అకారణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. దీని వెనుక ధర్మాన, కింజరాపు కుటుంబాల కుట్ర ఉందని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎడబాటు తాత్కాలికమేనని.. 2029 నాటికి తాను తిరిగి వైసిపిలోకి వస్తానన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా జగన్ హామీ ఉంటేనే అలా మాట్లాడుతున్నారన్న టాక్ ప్రారంభం అయింది. అయితే దువ్వాడ వస్తే ధర్మాన బ్రదర్స్ మాటేంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. దువ్వాడ శ్రీనివాస్ తో పోల్చుకుంటే ధర్మాన సోదరులు రాజకీయంగా బలమైన వారు. దువ్వాడ శ్రీనివాస్ కోసం వారిని జగన్ వదులుకుంటారా? అనేదే ఇక్కడ చర్చ.
కొద్ది రోజుల కిందట సస్పెన్షన్..
కొద్ది రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ ( duvvada Srinivas )వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ఆయన కుటుంబ వ్యక్తిగత వ్యవహార శైలితో పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. ఎన్నికలకు ముందు అంతర్గతంగా సాగిన కుటుంబ వివాదం.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బహిరంగంగా మారింది. సొంత భార్య, పిల్లలను కాదని దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి తో సన్నిహితంగా ఉంటున్నారు. రకరకాల రచ్చ నడిచింది. కుటుంబ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. కానీ దువ్వాడ శ్రీనివాస్ను ఆ సమయంలో సస్పెండ్ చేయలేదు. చాలా నెలల తరువాత దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మాధురితో కలిసి రీల్స్ చేయడం, అనైతిక బంధాన్ని కొనసాగించడం వంటి కారణాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారని.. అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే సస్పెన్షన్ వేటు పడిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ తన వ్యాపార పనుల్లో నిమగ్నమయ్యారు.
రాజకీయ దూకుడు..
తాజాగా రాజకీయ దూకుడు పెంచారు దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళం( Srikakulam) జిల్లా వచ్చి రాజకీయాల గురించి మాట్లాడారు. తన సామాజిక వర్గానికి చెందిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఇటీవల వచ్చిన ఆరోపణలపై మాట్లాడారు దువ్వాడ. అది కింజరాపు, ధర్మాన కుటుంబాలు కలిసి చేసిన కుట్రగా అభివర్ణించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఓ మహిళా ప్రిన్సిపల్ కూన రవికుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడాల్సిన దువ్వాడ శ్రీనివాస్.. కూన రవికుమార్ కు మద్దతు ఇచ్చారు. ఏకంగా అది కాలింగ సామాజిక వర్గం పై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. అయితే జిల్లా వైసీపీ నేతలు దువ్వాడ శ్రీనివాస్ను లైట్ తీసుకున్నారు. మా పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత ఎలా మాట్లాడితే తమకెందుకులే అన్నట్టు తేలిగ్గా తీసుకున్నారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన, కింజరాపు కుటుంబాలను టార్గెట్ చేసుకొని అలా మాట్లాడారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
సడన్ గా రూటు చేంజ్
అయితే ఇప్పుడు సడన్గా రూటు మార్చారు దువ్వాడ శ్రీనివాస్. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి అనుకూల మీడియా గా భావించే కొన్ని యూట్యూబ్ ఛానల్ లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలలో జగన్మోహన్ రెడ్డి పట్ల తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీ లోనే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు లేడని.. గొప్ప మానవతావాది అని చెబుతున్నారు. 2029 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించబోతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వైఖరి చూస్తుంటే ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే ముసలి నక్క అని వ్యాఖ్యానించిన ధర్మాన కృష్ణ దాస్ ఊరుకుంటారా? జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు అంగీకరిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే కేవలం ఒక వ్యూహం ప్రకారమే అటు తెలుగుదేశం పార్టీని.. ఇటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే కచ్చితంగా ఆయన వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయ ఉందన్నది ఒక బహిరంగ రహస్యం. ఇకనుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు మాత్రమే దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరి చూడాలి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..?