Medaram Jatara: తెలంగాణ మహా కుంభమేళాకు మేడారం సిద్దమవుతోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరిసీతక్క ఈమేరకు జాతర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు జాతర జరుగుతుంది. ఈమేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జంపన్న వాగుపై స్నాన ఘట్టాలు, క్యూలైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ పనులు పూర్తయ్యాయి.
23న సీఎం, గవర్నర్, రాష్ట్రపతి..
ఫిబ్రవరి 23న సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్ తమిళిసైతోపాటు రాష్ట్రపతి ముర్ము కూడా మేడారం వచ్చే అవకాశం ఉంది. ఈమేరకు మంత్రి సీతక్క ప్రకటించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
14న మండమెలిగే పండుగ..
మహాజాతర ప్రారంభానికి మరో 9 రోజుల సమయం ఉంది. ఇప్పటికే లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 11న కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక, జాతర ప్రారంభానికి సూచికగా ఈనెల 14న మండమెలిగే పండుగ నిర్వహిస్తామని గిరిజన పూజారులు తెలిపారు.
ఉత్సవ కమిటీ ప్రకటన..
ఇదిలా ఉండగా సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ నియమించింది. చైర్మన్‌గా ఆరెం లచ్చుపటేల్, కమిటీ సభ్యులుగా మిల్కూరి ఐలయ్యా, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణసింగ్, మంజుల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిశోర్, కొరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం కృష్ణస్వామి, ఎక్స్ అఫీషియో సభ్యులుగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావును నియమించారు. చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు సోమవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.