KTR: `రెడీ` సినిమాలో చిట్టినాయుడు గుర్తున్నాడా? తనకు సున్నా మార్కులు వేశాడన్న కారణంతో ఏకంగా పంతులునే కొట్టిస్తాడు! మన రాష్ట్రపతి ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఆ పంతులు `ప్రతిభా పాటిల్ బాబూ` అని ఏడ్చుకుంటూ సమాధానం చెప్తాడు.. `మరి లాస్ట్ టైం అబ్దుల్ కలాం అని చెప్పావ్` అని చిట్టినాయుడు అడిగితే `అది ఆ టైంలో బాబూ`.. అంటూ రోదిస్తాడు. ఇప్పడు రాష్ట్రపతి మారిపోయాడు అని చెప్తే `మారిపోతే అది నా తప్పా` అని ఎదురుతిరుగుతాడు. ఇక్కడ ఆ చిట్టినాయుడి తాత పేరు కూడా చిట్టినాయుడే.. ఈ చిన్న తెలివి తక్కువ చిట్టినాయుడిని అడ్డంపెట్టుకొని వాళ్ల అమ్మ తన మామ అయిన మూర్ఖపు పెద్ద చిట్టినాయుడిని ఇష్టంవచ్చినట్టు తిడుతూ తన కోపాన్ని తీర్చుకుంటుంది. సినిమాలో ఈ సీన్ తెలియని వారు.. ఆసీన్ ను ఎంజాయ్ చేయని వారు లేరంటే దాదాపు అతిశయోక్తికాదు! ఇప్పుడిదంతా ఎందుకు అంటరా? ఆగండాగండి అక్కడికే వస్తున్న.. ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు.. బీఅర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని l`చిట్టి నాయుడు` అని సంభోదిస్తూ తెగ ర్యాగింగ్ చేసేస్తున్నారు. ఒక్క చిట్టినాయుడు అనే కాదు.. నిన్నమొన్నటిదాకా `చోటా భాయ్`.. అనీ పిలిచాడు. రాజకీయ నేతల మధ్య దోస్తీ.. దుష్మన్ ఎలా ఉన్నా.. ఇలాంటి సెటైరికల్ పిలుపు మాత్రం ప్రజల్లో నవ్వు తెప్పిస్తున్నది.. ఒక్కో సందర్భం నుంచి కేటీఆర్ పుట్టించిన ఒక్కో పిలుపుతోనే రేవంత్ రెడ్డి యాంటీ టీం అంతా సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నది.
*ఇంతకీ అవెలా వచ్చాయంటే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తగా ఆదిలాబాద్ జిల్లాలో ఓ కార్యక్రమం జరిగింది. అక్కడ వేదికను ప్రధాని మోదీతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి పంచుకున్నారు. ఇదే వేదికపై ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి ప్రశ్నంసలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి అభివ్రుద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని, రాష్ట్రాభివ్రుద్ధికి పెద్దన్న పాత్ర పోషించాలని `బడే భాయ్` అని మోదీని సంబోధించారు. పరస్పరం విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన పార్టీ నేతలు ఒకే వేదికను పంచుకోవడం, పైగా దేశంలో అధికార, విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒకదానినొకటి తిట్టుకోవడం, రాష్ట్రానికి వచ్చే సరికి ఇరు పార్టీల నేతలు చెట్టాపట్టాల్ వేసుకోవడంపై తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. ఆ రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని మొదటి నుంచీ విమర్శిస్తున్న బీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి అలా పట్టుబడడం మరింత బలాన్నిచ్చినట్టయింది. అప్పటి నుంచి `కేంద్రంలో బడేభాయ్.. రాష్ట్రంలో చోటే భాయ్ (రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ)` అంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది.
*చంద్రబాబు నాయుడు.. తమ్ముడు చిట్టి నాయుడు
మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని చోటేభాయ్ అని పిలిచిన కేటీఆర్ తాజాగా పిలుపు మార్చారు..
కొత్తగా రేవంత్ రెడ్డిని చిట్టి నాయుడు అని పిలవడం మొదలుపెట్టారు.. దీని వెనుక మర్మం ఏమిటా? అని ఆలోచిస్తే టీడీపీలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడికి రేవంత్రెడ్డి శిశ్యుడని బీఆర్ఎస్ ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్నది.. తెలంగాణ బద్ద శత్రవులా చూసే చంద్రబాబు నాయుడి శిశ్యుడే ఇక్కడ పాలిస్తున్నాడహో అని కోడై కూస్తున్నది.
ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిషన్) చైర్మన్ను కాంగ్రెస్ సర్కార్ అరికెపూడికి కట్టబెట్టింది. ఇప్పటికే ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్, పీఏసీ పదవి గాంధీకి ఇవ్వడంపైనా మండిపడింది. ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేందుకు మంత్రి శ్రీధర్బాబు సందిస్తూ అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నాడని, వారి మధ్య గొడవ బీఆర్ఎస్కు చెందిన వ్యవహారమని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ఇలా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్ వేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన రేవంత్రెడ్డి కూడా శ్రీధర్బాబు మాటల ప్రకారం ఇంకా టీడీపీలోనే ఉన్నట్టా?అని ఎద్దేవా చేశారు. అటు చోటా (చిట్టి).. ఇటు చంద్రబాబు నాయుడులో నాయుడును తీసుకొని కొత్తగా చిట్టినాయుడు అని పిలవడం సోషల్ మీడియాలో మార్మోగుతున్నది..
-K.R.