HomeతెలంగాణKTR: బీఆర్‌ఎస్‌లో అంతర్గత స్వేచ్ఛ ఉందంటావా రామన్న..!?

KTR: బీఆర్‌ఎస్‌లో అంతర్గత స్వేచ్ఛ ఉందంటావా రామన్న..!?

KTR: రాజకీయాల్లో అంతర్గత స్వేచ్ఛ అనేది ఏ పార్టీకి అయినా చాలా ముఖ్యం, అవసరం. తప్పు ఒప్పులను చెప్పే స్వేచ్ఛ ఉండాలి. వినే నాయకత్వం ఉండాలి. అప్పుడే పార్టీలో అధిష్టానానికి, నాయకులు, కార్యకర్తలకు మధ్య సమన్వయం ఉంటుంది. పార్టీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. స్వేచ్ఛ లేని పార్టీ ఎక్కువకాలం మనుగడ సాగించలేదు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ నేపథ్యంలో పార్టీలో అంతర్గత స్వేచ్ఛపై ప్రస్తుతం పార్టీలో, తెలంగాణలో చర్చ జరుగుతోంది.

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో అంతర్గత స్వేచ్ఛ ఉందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) చుట్టూ ‘దెయ్యాలు’ ఉన్నాయని పేర్కొనడం ద్వారా, పార్టీలోని అంతర్గత విభేదాలు, కొందరు నాయకుల వైఖరిని సూచించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కేసీఆర్‌ కామారెడ్డిలో ఓడిపోవడం, పలువురు నాయకులు కాంగ్రెస్, బీజేపీల్లో చేరడం వంటి అంశాలు పార్టీలో అస్థిరతను సృష్టించాయి. కవిత లేఖలో కేసీఆర్‌ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ, అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని హైలైట్‌ చేశారు.

కవిత లేఖను తప్పు పట్టిన కేటీఆర్‌..
ఇదిలా ఉంటే.. కవిత లేఖ రాయడాన్ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తప్పు పట్టారు. పార్టీలో సమన్వయం కోసం అనేక విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయా విభాగాలతో మాట్లాడి అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని సూచించారు. మీడియాకు ఎక్కడం వలన నష్టం తప్ప లాభం ఉండదని స్పష్టం చేశారు. ఇది అందరికీ వర్తిస్తుందని కవితను సున్నితంగా హెచ్చరించారు.

అంతర్గత సవాళ్లు, నాయకత్వ ఒత్తిడి
బీఆర్‌ఎస్‌లో కొందరు నాయకులు కేసీఆర్‌ నాయకత్వాన్ని ‘నియంతృత్వం’గా విమర్శిస్తున్నారు. కమీషన్ల ఆరోపణలు, నాయకుల మధ్య సమన్వయ లోపం, అసంతృప్త నాయకుల వలసలు పార్టీకి సవాళ్లుగా మారాయి. కేటీ రామారావు (కేటీఆర్‌), హరీష్‌ రావు వంటి కీలక నాయకులు పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా కృషి చేస్తున్నారు. ఇటీవలి కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల అసంతృప్తి, నాయకత్వంపై విమర్శలు పార్టీ ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పార్టీలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని సృష్టించడం, అంతర్గత చర్చలను ప్రోత్సహించడం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్‌ మోనార్క్‌..
ఇక బీఆర్‌ఎస్‌ అంటేనే కుటుంబ పార్టీ. అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఈ ఇద్దరే నిర్ణేతలు. ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోరు. వారు అనుకున్నదే చేసేస్తారు. ఈ నియంతృత్వం కారణంగానే నంబర్‌ 2 స్థాయికి ఎదిగిన చాలా మంది తర్వాత రాజకీయాల్లో లేకుండా పోయారు. ఇందుకు ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్‌ ఉదాహరణ. మోనోపాలి నిర్ణయాలు కేసీఆర్‌వి. కేసీఆర్‌ను కలవడమే గగనంగా ఉన్న పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఉందని కేటీఆర్‌ మాట్లాడడం ఇప్పుడు ఆ పార్టీలో అంతర్గత చర్చకు దారి తీసింది.

ఐక్యతే కీలకం..
పార్టీలో స్వేచ్ఛ ఉందని, అయితే అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు నాయకత్వం చర్చలు జరుపుతోందని సమాధానం చెప్పవచ్చు. కేసీఆర్‌ స్వయంగా అసంతృప్త నాయకులను కలుపుకొని, కమీషన్ల ఆరోపణలను అరికట్టేందుకు చొరవ తీసుకోవాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలం నిరూపించుకోవాలంటే, నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యతను నెలకొల్పడం కీలకం. ప్రతిపక్షాలు ఈ సంక్షోభాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున, బీఆర్‌ఎస్‌ తక్షణ చర్యలతో ముందుకు సాగాలని సూచనలు వస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version