KTR: జూబ్లీహిల్స్ నియోజవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు వాస్తవ పరిస్థితిని తెలిసేలా చేసినట్టుంది. జూబ్లీహిల్స్ ఫలితం వెలువడిన తర్వాత కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సాధారణంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రస్తావన వస్తే చాలా పరుషమైన పదజాలం వాడుతుంటారు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఇదే స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసేవారు. పరుషమైన పదజాలం వాడేవారు. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కేటీఆర్ తన ధోరణి మార్చుకోలేదు.
ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ కేటీఆర్ అదే స్థాయిలో దూకుడు కొనసాగించారు. తన అభ్యర్థిగా విస్తృతంగా ప్రచారం చేశారు.. ప్రధాన మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇతర మాధ్యమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్థాయిలో కేటీఆర్ మీడియాను వాడుకున్నప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది. పైగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించారు. మెజారిటీలో సరికొత్త రికార్డులను నెలకొల్పారు.
గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. అయితే ఈసారి వాస్తవంలోకి వచ్చి కేటీఆర్ అసలైన విషయాలను చెప్పారు. 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీకి 0 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేరి సమానంగా పార్లమెంటు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని కమలం పార్టీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు వచ్చేసరికి కమలం పార్టీ నాయకులు చెప్పింది మొత్తం అబద్ధమని తేలిపోయింది . అంతేకాదు కమలం స్థానం కూడా మూడో స్థానానికి దిగజారిపోయింది.
సరిగా ఏడాదికి మించి సమయం గడిచిన తర్వాత తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. బిజెపి స్థానంలోకి గులాబీ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి.. ఆస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. కానీ బిజెపి మాత్రం తన రెండవ స్థానాన్ని గులాబీ పార్టీకి త్యాగం చేసింది. ఇదే అర్థం వచ్చేలా కేటీఆర్ మాట్లాడారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా.. వచ్చిన ఓట్ల ద్వారా తాము సంతృప్తితో ఉన్నామని.. కాంగ్రెస్ పార్టీకి తామే ఆల్టర్నేటివ్ అని తెలంగాణ ప్రజలు గుర్తించారని కేటీఆర్ పేర్కొన్నారు.. కేటీఆర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది కమలం పార్టీ నాయకులే.