Radisson Pub Case: బీఆర్‌ఎస్‌పైగానీ, పార్టీ నేతలపైగానీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇటీవలే హెచ్చరించారు. చెప్పినట్లుగానే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. తాను కాకుండా తన బావమర్దితో 16 మీడియా సంస్థలపై కేసు పెట్టించారు గులాబీ నేత.
రాడిసన్ డ్రగ్స్ కేసులో..
హైదరాబాద్‌లోని రాడిసన్ పబ్ కేసులో తనపై తప్పుడు వార్తలు రాశాయని 16 మీడియా సంస్థలతో కేటీఆర్ బావమరిది రాజేందర్‌ప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో గులాబీ నేతలతోపాటు కల్వకుంట్ల ఫ్యామిలీ సభ్యులు ఉన్నట్లు అపట్లో ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. దీనిపై కేటీఆర్ బావమరిది రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ సూచనతో 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసలు పంపించారు.
నోటీసులు పంపిన సంస్థలు..
సమయం టీవీ, హిట్ టీవీ తెలుగు, తుపాకీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ మీడియాహౌస్ ప్రైవేటు లిమిటెడ్, హాష్‌ట్యాగ్ యూ, ఏసియా నెక్ట్స్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్, ఏసియా న్యూస్ తెలుగు, ఆంధ్రా విశేష్, శ్లాష్ మీడియా అండ్ టెక్నాలజీస్, యోయో మీడియా ప్రైవేటు లిమిటెడ్, ఓకే టీవీ మీడియా బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేటు లిమిటెడ్, ప్రవాస మీడియా ఎల్‌ఎల్‌పీ, విడ్‌వోల్ఫ్ న్యూస్, కాళోజీ టీవీ దాసరి శ్రీనివాస్, యూట్యూబ్ ఐఎన్‌సీ, గూగుల్ ఎల్‌ఎల్‌సీ సంస్థలకు నోటీసులు పంపించారు.
వరుస కథనాలతో ఉక్కిరి బిక్కిరి..
ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్ పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. కాళేశ్వరం అవినీతి నుంచి మొదలు ఢిల్లీ లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్, భూముల కబ్జా, ఇలా ఏ కుంభకోణం చూసినా కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉంటుంది. దీంతో మీడియా సంస్థలు కేసీఆర్ కుటుంబం బాగోతాలపై కథనాలు ప్రచురిస్తున్నాయి. దీంతో గులాబీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ లీగల్ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.