Gas EKYC: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొన్ని పనుల్లో కదిలిక ఏర్పడింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం నిజమైన అర్హులకు పథకాలు అందేలా విధి విధానాలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరువాత రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు ఉపయోగించుకునేలా అవకాశం కల్పించారు. ఆ తరువాత రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందించేలా రూపకల్పన చేయనున్నారు. ఈ క్రమంలో గ్యాస్ సబ్సిడీ పొందాలనుకునేవారు e-KYC అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. దీంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో గ్యాస్ ఏజెన్సీలు కీలక ప్రకటన చేశాయి.
e-KYCఅప్డేట్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. నిజమాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున మహిళలు క్యూలో ఉండడంతో కొన్ని గొడవలు కూడా జరిగాయి. ఈ పరిస్థితిని గమనించి e-KYC ఈజీగా అప్డేట్ చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు e-KYC చేసుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే దీనిని అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు.
గ్యాస్ బుక్ చేయగానే ఇంటికి వచ్చి గ్యాస్ బాయ్ సిలిండర్ ను అందిస్తారు. ఇలా వచ్చి బాయ్ వద్ద e-KYC అప్డేట్ చేసుకోవచ్చని ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తెలిపింది. గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద e-KYC యాప్ ఉంటుంది. అతనికి సరైన వివరాలు అందిస్తే తన మొబైల్ లే నమోదు చేసుకొని అప్డేట్ చేస్తారు. ఆ తరువాత e-KYC పూర్తవుతుంది. ఇలా ఎలాంటి ఇబ్బంది లేకుండా e-KYCని అప్టేడ్ చేసుకోవాలని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే ఆరు గ్యారెంటీల పథకాల్లో రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ ఒకటి. దీనిని ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో e-KYC అప్డేట్ అడిగారు. దీంతో గ్యాస్ వినియోగదారులు ఏజెన్సీల వద్ద బారులు తీరడాన్ని గమనించి ఇలా సులువుగా e-KYC అప్డేట్ చేసుకునే విధానాన్ని కల్పించింది.