KCR: తొమ్మిదిన్నర ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్) పార్టీని ప్రజలు ఈసారి ప్రతిపక్షానికే పరిమితం చేశారు. కేవలం 38 స్థానాలో గెలిపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ మూడో శాసన సభ కొలువుదీననుంది. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ క్రమంలో విపక్ష బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో సారథి ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రమాణ స్వీకారానికి ముందే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ ఎల్పీ లీడర్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
9 గంటలకు సమావేశం..
శనివారం ఉదయం తొమ్మిదిగంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ శాసనసభ్యులు సమావేశం కానున్నారు. ఈ సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సమావేశంలోనే పార్టీ శాసన సభా పక్ష నేతగా ప్రభుత్వంపై పోరాటం చేసే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావునే ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. మొదట కేసీఆర్ ఎల్పీలీడర్ గా ఉండడం లేదన్న వార్తలు వచ్చాయి. కేటీఆర్, హరీశ్ రావు లేదా కడియం శ్రీహరి ఎల్పీ లీడర్‌గా ఎన్నికవుతారని, అసెంబ్లీలో పార్టీని నడిపిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అసెంబ్లీలో అధికార పార్టీని దీటుగా అడ్డుకునేందుకు కేసీఆరే బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆరే ఉండాలనుకుంటున్న ఎమ్మెల్యేలు
బాత్‌రూంలో జారిపడి తొంటి విరగడంతో యశోద ఆస్పత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. ఆయన హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కేసీఆర్‌నే తమ నేతగా ఎంపిక చేసుకోవాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి కేసీఆర్ నేతృత్వంలోనే ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. రెండు నెలల వరకూ.. అసెంబ్లీలో సమావేశాలు జరిగితే.. ఉపనేతలుగా ఎన్నికయ్యే వారు బాధ్యతలు నిర్వహిస్తారు. అధికారికంగా ప్రతిపక్ష నేతగా మాత్రం కేసీఆరే ఉంటారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత కేటీఆర్..
కేసీఆర్ ఇక పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని అనుకున్నారని.. కేటీఆర్‌కు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నారని రెండు రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతీకార రాజకయాలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ ఉండటమే మంచిదన్న వాదనను కొంతమంది సీనియర్ నేతలు వినిపించినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ కూడా.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాగూ.. జాతీయ రాజకీయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నందున… అప్పుడే ఎమ్మెల్యే పదవికి.. ప్రతిపక్షనేత పదవికి కూడా రాజీనామా చేయవచ్చని.. ఇప్పటికైతే తానే ఉండటం మంచిదని ఆయన నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. తర్వాత కేటీఆర్ ప్రతిపక్ష నేత అవుతారని తెలుస్తోంది.