KCR And Jagan: రాజకీయాల్లో కష్టపడాలి. ప్రజల మధ్యకు వెళ్లాలి. ప్రజలతో మమేకమై పనిచేయాలి. అప్పుడే ప్రజలు నేతలను గుర్తిస్తారు. సెంటిమెంట్లకు, సానుభూతిలకు కొద్దిరోజులే ప్రజలు ఆకర్షణకు గురవుతారు. అది అలానే ఉంటుందని అనుకోకూడదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. బాగా కష్టపడ్డారు. పార్టీ కోసం పరితపించారు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడే పార్టీ పతనం అవుతుందని అంతా అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ గత మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ రావడంలో చంద్రబాబు కృషి ఉంది. ఆ ఇద్దరు నేతలది కష్టపడే తత్వం.
* ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటుతో..
ఇక సెంటిమెంట్ గురించి చెప్పుకుంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురించి చెప్పుకోవాలి. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్తో సుదీర్ఘకాలం రాజకీయం చేశారు కేసీఆర్. మన ప్రయోజనాలను ఏపీ ప్రజలు కొట్టుకుపోతున్నారని.. ఆంధ్ర పాలకులతో తెలంగాణ దగాకు గురైందని.. ఇలా ఎన్నెన్నో తెలంగాణ ప్రజల్లో బలంగా నాటారు కెసిఆర్. తెలంగాణ ప్రజలు కూడా ఎంతో బాగా నమ్మారు. నవతెలంగాణ కు కెసిఆర్ ను మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. రెండోసారి కూడా ఆంధ్ర పాలకులు అంటూ అనేసరికి తెలంగాణ ప్రజలు మరోసారి కెసిఆర్ పట్ల నమ్మకం చూపారు. అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ పోయిందని భావించిన కేసీఆర్ భారత రాజకీయాలను ప్రభావితం చేద్దామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఆంధ్ర పాలకులు అంటూ విషం నింపిన కేసీఆర్ పాలనను చూశారు తెలంగాణ ప్రజలు. అందుకే ఈసారి సెంటిమెంట్ను నమ్మకుండా.. తమకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఇబ్బందులు పడుతున్న పార్టీగా మిగిలిపోయింది.
* రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో..
ఏపీ విషయానికి వస్తే తన తండ్రి అకాల మరణాన్ని సానుభూతిగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 2009లో అత్తెసరు మెజారిటీతో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి. కొద్ది కాలానికి ప్రమాదంలో చనిపోయారు. అయితే రాజశేఖర్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలకు అభిమానులుగా మారిన ప్రజలు ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించారు. ఆపై కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అలా సానుభూతి అనే బలమైన పునాదులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ ప్రజలు 2014లో అధికార పార్టీతో సమానంగా జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. విభజిత ఆంధ్ర ప్రదేశ్ ను గాడిలో పెట్టే అనుభవం చంద్రబాబుకు ఇచ్చినా.. ఇంచుమించు ఆయనతో సమానంగా బలం ఇచ్చారు. 2019 నాటికి జగన్మోహన్ రెడ్డి సానుభూతికి తోడు ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో అంతులేని విజయంతో అధికారంలోకి రాగలిగారు. కానీ సెంటిమెంట్ అనేది ఒక నీటి బుడగ అని గుర్తించలేకపోయారు. దానికి 2024 ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు.
* కుటుంబాల్లో విభేదాలు..
అయితే ఇప్పటికైనా రెండు కుటుంబాలు సెంటిమెంట్ అన్నది వీడాలి. తెలంగాణలో కెసిఆర్ కుటుంబం.. ఏపీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం. ఈ రెండు కుటుంబాల్లో ఆడపడుచులు ఇప్పుడు బయటకు వచ్చారు. అన్నలను విభేదిస్తున్నారు. తండ్రులను గౌరవిస్తున్నారు. అలా సెంటిమెంటును ప్రజల్లో రగిలించి ఇంకా తమ కుటుంబాలు ఉనికిలో ఉన్నాయన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ సెంటిమెంట్ అనేది కొంతకాలం వరకే అన్న విషయాన్ని ఆ రెండు కుటుంబాలు గ్రహిస్తే మంచిది. ప్రజలకు వారేంటో తెలిసిపోయింది. వారి పాలనను సైతం చూశారు. అందుకే ఇప్పటి ప్రభుత్వాలకు మించి, అధికార పార్టీలకు మించి ప్రజలకు నమ్మకం కలిగిస్తే మాత్రం వారికి ఆదరణ దక్కుతుంది. లేకుంటే చాలా కష్టం.