Kavitha vs Harish Rao: జాగృతి అధినేత్రి ఇటీవల కాలంలో సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. ఆ విషయాలను వెల్లడించేటప్పుడు ఆమె ఏమాత్రం భయాన్ని ప్రదర్శించడం లేదు. కెసిఆర్ కుమార్తెగా ప్రతి మాటను తూటాలాగా వదులుతున్నారు. రాజకీయాలలో ఇటీవల కాలంలో ఈ తరహాలో మాట్లాడిన మహిళ నాయకురాలు లేదంటే అతిశయోక్తి కాదు. సహజంగానే కల్వకుంట్ల కవితలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది.. అందువల్లే ఆమె ఏ అంశం పైన అయినా సరే స్పష్టంగా మాట్లాడుతారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడరు. అందువల్లే ఆమె ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించారు.
ఇటీవల కాలంలో ఆమె మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ హరీష్ రావు, సంతోష్ రావు మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తన తండ్రి కెసిఆర్ మీద సిబిఐ కేసులు నమోదు చేయడానికి హరీష్ రావు కారణమని.. హరీష్ రావు వల్లే ఇంతటి దుస్థితి ఏర్పడిందని కల్వకుంట్ల కవిత ఆరోపించిన విషయం తెలిసిందే. హరీష్ రావు మీద కవిత చేసిన ఆరోపణ నేపథ్యంలో.. అసలు ఎందుకు ఈ స్థాయిలో వారిద్దరి మధ్య ఆగాధం ఏర్పడింది అనే విషయంపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. ఎవరి విశ్లేషణలు వారు చేశారు. కొన్ని ఊహాగానాల మాదిరిగా ఉన్నాయి. కొన్నేమో వాస్తవాలు మాదిరిగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కవిత చేసిన ఆరోపణలకు మీడియా విశేష ప్రాధాన్యం ఇచ్చిందనేది మాత్రం వాస్తవం. అయితే తనకు, హరీష్ రావుకు మధ్య ఆగాదం ఏర్పడేందుకు ప్రధాన కారణం ఏమిటో కవిత ఇన్నాళ్లకు బయటపెట్టారు.
శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కవిత హరీష్ రావు విషయంలో తాను ఎందుకు అంత ఆగ్రహంగా మాట్లాడుతున్నానో వివరించారు.”కొత్త రాజకీయ పార్టీపై నేను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితిలో చేరే ఆలోచన లేదు. పార్టీ ఏర్పాటు చేసే ముందు కేసీఆర్ వందల మందితో చర్చించారు. నేను కూడా అదే పని చేస్తున్నాను. తండ్రి ఏర్పాటుచేసిన పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే. కాళేశ్వరం విషయంలో తప్ప వేరే ఏ విషయంలోనూ హరీష్ రావు పై నాకు కోపం లేదు. కాళేశ్వరం నిర్మాణ విషయంలో ప్రతి నిర్ణయం కూడా కేసీఆర్ తీసుకున్న దేనిని కమిషన్ ఎదుట హరీష్ చెప్పారు. కెసిఆర్ ఖ్యాతిని అపఖ్యాతి పాలు చేశారు. అందువల్లే నేను ఆయనతో విభజించాల్సి వచ్చింది. బంగారు తెలంగాణ కోసం.. కోటి ఎకరాల మాగాణం కోసం నా తండ్రి కృషి చేస్తే. దానిని అభాసుపాలు చేయడానికి కొంతమంది కుట్రలు పన్నారు. వారి కుట్రల వల్లే నా తండ్రి మీద సిబిఐ ఎంక్వయిరీ వేశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అంటూ” కవిత ప్రశ్నించారు. మొత్తానికి హరీష్ రావు తో ఏర్పడిన వివాదం గురించి కవిత క్లారిటీ ఇవ్వడంతో మీడియాలో ఊహాగానాలు తగ్గిపోయాయి. కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హరీష్ రావు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.