Kavitha Sensational Allegations: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో ఆంతరంగిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావుపై సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీలోని అసంతృప్తిని బహిర్గతం చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బుధవారం(సెప్టెంబర్ 3న) నిర్వహించిన మీడియా సమావేశంలో ఒత్తిడిలోనే మాట్లాడారు. హరీశ్‌రావుపై తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్‌కు అనేక అనుమానాలు కలిగేలా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు కూడా కేసీఆర్, హరీశ్‌రావుకు నిజమే అనిపించేలా అంతర్గత విషయాలు బయట పెట్టారు.
పార్టీని కబ్జా చేస్తారని హెచ్చరిక..
హరీశ్‌రావు బీఆర్‌ఎస్ ఓటములకు, పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై అవినీతి ఆరోపణలకు ప్రధాన కారణం హరీశ్‌రావు అని పునరుద్ఘాటించారు. హరీశ్‌రావును ‘ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్‘ అని విమర్శిస్తూ, ఆయన చర్యలు పార్టీకి హాని కలిగించాయని ఆరోపించారు. హరీశ్‌రావు తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నారు, పార్టీలోని పలువురు నాయకుల బయటకు వెళ్లడానికి కారణమయ్యారు. జగ్గారెడ్డి, విజయశాంతి, మైనంపల్లి, ఈటల రాజేందర్ వంటి నాయకులు పార్టీని వీడడానికి హరీశ్‌రావు చర్యలే కారణమని ఆరోపించారు.
ఓటమికి ఆర్థిక సాయం..
కవిత ఆరోపణల్లో అత్యంత సంచలనాత్మకమైన అంశం, హరీశ్‌రావు ఎన్నికల్లో ఆర్థిక లావాదేవీల్లో పాల్గొన్నారన్న వాదన. 2009 సిరిసిల్ల ఉప ఎన్నికల్లో కేటీఆర్‌ను ఓడించేందుకు హరీశ్‌రావు రూ.60 లక్షలు పంపించారని, 2018 ఎన్నికల్లో 20 మంది ఎమ్మెల్యేలకు ఆర్థిక సాయం చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు హరీశ్‌రావు పార్టీలోని ఆర్థిక నిర్వహణ, ఎన్నికల వ్యూహాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. అదే సమయంలో, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ ఓటములకు హరీశ్‌రావే కారణమని కవిత వాదించారు, ఇది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర..
కవిత మరో కీలక ఆరోపణలో, హరీశ్‌రావు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇద్దరూ ఒకే విమానంలో ప్రయాణించిన సంఘటనతో ఈ కుట్ర మొదలైందని పేర్కొన్నారు. ఈ ఆరోపణ బీఆర్‌ఎస్‌లోని అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేసింది. రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు కలిసి కేసీఆర్‌ను రాజకీయంగా బలహీనపరిచేందుకు కుట్ర పన్నినట్లు కవిత వాదించడం, పార్టీలోని ఐక్యతపై గట్టి దెబ్బ తీసింది.
కవిత ఆరోపణలు బీఆర్‌ఎస్‌లో లోతైన అసంతృప్తిని, నాయకత్వ సంక్షోభాన్ని బయటపెట్టాయి. హరీశ్‌రావుపై ఆరోపణలు, రేవంత్ రెడ్డితో కుట్రల ఆరోపణలు, ఆర్థిక లావాదేవీల వాదనలు పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయి. ఈ పరిస్థితి కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రత్యర్థి పార్టీలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది.