Kavitha Political Future: రాజకీయాలలో వ్యక్తిగత అవసరాలు మాత్రమే ఉంటాయి. వ్యక్తిగత అవసరాల కోసం నాయకులు ఏమైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. చివరికి తమ ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడానికి, దూరం పెట్టడానికి వెనుకాడరు. ఇప్పుడు ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి విష ప్రచారానికి.. అడ్డగోలు వ్యక్తీకరణలలో ఏమాత్రం తగ్గరు.
Also Read: ఫామ్ హౌస్ కు కవిత వచ్చినవేళ హరీష్ రావు, కేటీఆర్ ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే?
పై ఉపోద్ఘాతం మాదిరిగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తోంది. కొంతకాలంగా జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితకు, ఆమె సోదరుడు భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మధ్య విభేదాలు ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని రాఖీ కట్టడానికి తాను వస్తానని సందేశం పంపినప్పటికీ.. కవితకు అవుట్ ఆఫ్ స్టేషన్ అని కేటీఆర్ రిప్లై ఇచ్చినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అటు జాగృతి అధినేత్రి.. ఇటు గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఖండించలేదు. పైగా జాగృతి అధినేత్రి కుమారుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్నప్పుడు టాటా కెసిఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికి ఎరవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడు. ఆ సమయంలో జాగృతి అధినేత్రి కూడా ఉన్నారు. పడక గదిలో ఉన్న కేసీఆర్ వద్దకు ఆయన సతీమణి శోభమ్మ కవిత కుమారుడిని తీసుకెళ్లారు. కవితను చూసి కూడా పడకగది నుంచి గులాబీ దళపతి బయటికి రాలేదని తెలుస్తోంది. కవిత ఎర్రవల్లి క్షేత్రానికి వెళ్ళినప్పుడు కేటీఆర్, హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారని సమాచారం.
ఈ పరంపర ఇలా కొనసాగుతుండగానే.. జాగృతి అధినేత్రి అమెరికాలో ఉండగానే.. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆమెకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నల్ల బంగారం విస్తారంగా ఉన్న ప్రాంతాలలో గులాబీ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగే కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ ను నియమించారు. ఇటీవలే గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈ నిర్ణయాన్ని ప్రకటించగా.. బుధవారం దానిని అమలులోకి తెచ్చారు. వాస్తవానికి కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని జాగృతి అధినేత్రి స్వాగతించారు. అక్కడితోనే కవిత ఆగలేదు నల్లగనుల్లో కార్మికుల పక్షాన పోరాడుతున్న వివిధ సంఘాల నాయకులతో ఆమె భేటీ అయ్యారు. ఒకవేళ కొప్పుల ఈశ్వర్ నియామకం అధికారికంగా పూర్తయితే.. తను కూడా గనులు విస్తరించిన ప్రాంతంలో కీలకపాత్ర పోషించాలని కవిత అనుకున్నట్టు తెలుస్తోంది. కవితతో రియాజ్ లాంటి సీనియర్ కార్మిక సంఘం నాయకులు ఉండడం పై వాదనలకు బలం చేకూర్చుతోంది.
Also Read: కల్వకుంట్ల కవిత హెచ్చరిస్తోంది.. రేవంత్ ప్రభుత్వం ఇకనైనా మారుతుందా..
ప్రస్తుతం జాగృతి అధినేత్రి అమెరికాలో ఉన్న నేపథ్యంలో.. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన కార్యాచరణను కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారని సమాచారం. ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన తండ్రికి కాలేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. ధర్నా చౌక్ లో నిరసన కూడా చేపట్టారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఇటీవల ఆందోళన కూడా చేశారు. తెలంగాణ కవులు, కళాకారులతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూస్తే కల్వకుంట్ల కవిత తనకంటూ సొంతంగా రాజకీయ క్షేత్రాన్ని నిర్మించుకుంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆమె తదుపరి అడుగులు ఏంటనేది తేలుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.