Kavitha Comments On Chandrababu: సొంతంగా ఎదగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో ఒక వెలుగు వెలిగిన తెలంగాణ జాగృతిని మళ్లీ చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు. ఇక ఇదే సమయంలో కల్వకుంట్ల కవిత రాసినట్టుగా కొన్ని లేఖలు మీడియాకు బహిర్గతమయ్యాయి. ఇక అప్పట్నుంచి కాక మొదలైంది. దాదాపు పది రోజుల నుంచి కల్వకుంట్ల కవిత కేంద్రంగా రకరకాల విషయాలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు ప్రధానంగా ఆర్కె సొంత పత్రిక గులాబీ బాస్ కూతురు మీద పుంఖాను పుంఖాలుగా వార్త కథనాలను కుమ్మేస్తోంది. వీటిని తప్పుడు వార్తలని కల్వకుంట్ల కవిత చెబుతున్నప్పటికీ.. ఆర్కే మాత్రం కథనాలను రాయడం ఏమాత్రం ఆపడం లేదు.
ఇక తనమీద విపరీతమైన వ్యతిరేక వార్తలు, రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధిపతి స్పందించక తప్పలేదు. ఈ క్రమంలోనే మీడియా చిట్ చాట్ లో ఆమె పాల్గొన్నారు. సోదరుడు, గులాబి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మీద సంచలన ఆరోపణలు చేసిన కవిత.. చివరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా వదిలిపెట్టలేదు. ” తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను తాను వ్యతిరేకించలేదని చంద్రబాబు చెబుతున్నారు. ఇదంతా కూడా హాస్యాస్పదం. ప్రజాభవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాతే.. చంద్రబాబు నాయుడు బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కు అంకురార్పణ చేశారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి జలాల పంపిణీ సక్రమంగా జరగలేదు. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధిలోనూ చంద్రబాబు అబద్దాలు మాట్లాడారు.. తెలంగాణ నికర ఆదాయాన్ని పెంచినట్టు ఆయన చెప్పుకున్నారు. అదంతా కూడా అబద్ధమని” గులాబీ బాస్ కూతురు కొట్టి పారేశారు..
మీడియా చిట్ చాట్ లో గులాబీ సుప్రీం డాటర్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు.. పరోక్షంగా విమర్శలు చేస్తూనే.. తను అనుభవించిన బాధను మొత్తం వెల్లగక్కారు. తనను కొంతమంది ఇబ్బంది పెడుతున్న తీరును వివరించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలను వివరించారు. ఆడబిడ్డనైన నన్ను తీవ్రంగా వేధిస్తున్నారని.. నన్ను అలా చేస్తే వారికి వచ్చిన ఉపయోగం ఏంటో అని కల్వకుంట్ల కవిత నేరుగా ప్రశ్నించారు. పేరు ప్రస్తావించకపోయినప్పటికీ సోదరుడిని గ్రీకువీరుడుగా అభివర్ణించారు.. తను రాసిన లేఖలను బహిర్గతం చేసిన వ్యక్తులను పట్టుకోవాలని చెబితే.. తనని ఇబ్బంది పెడుతున్నారని కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. చినికి చినికి గాలి వాన లాగా మారిన ఈ వ్యవహారం ఎక్కడిదాకా దారి తీస్తుందో తెలియదు గానీ.. గులాబీ సుప్రీం కూతురు ఇస్తున్న లీకులు, బయటికి చెబుతున్న అంతర్గత విషయాలు మాత్రం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలలో పెను సంచలనానికి కారణమవుతున్నాయి.