KCR Daughter Kavitha: సీఎం కేసీఆర్ కు తొలి నుంచి కూడా జాతీయ రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫ్రెడరల్ ఫ్రంట్ అని హడావుడి చేసిన కేసీఆర్ ఆ తర్వాత ఎందుకోగానీ సైలంటయ్యారు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరోసారి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటాలని ఉవ్విళ్లురుతున్నారు.
ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శనాస్త్రాలకు దిగుతున్నారు. గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి మరీ కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఈక్రమంలోనే బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఎవరికీ వారు తగ్గెదేలే అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని కొంతమేరకు సీఎం కేసీఆర్ ఇరుకున పెట్టగలిగారు. ఈ విషయంలో కొంత పైచేయి సాధించారు. అయితే రబీ ధాన్యం కొనుగోలు విషయంలోనూ మరోసారి కేంద్రాన్ని బాదానం చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. ఈనెల 11న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పక్షాన ధర్నా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
పనిలో పనిగా ఉత్తరాది కేసీఆర్ ఇమేజ్ పెరిగేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో ఆయన వ్యూహాలను ఎమ్మెల్సీ కవిత దగ్గరుండి చూసుకుంటున్నారు. వారంరోజులుగా కేసీఆర్ తో కలిసి ఢిల్లీలో తిష్టవేసిన కవిత వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఎంపీగా గతంలో తనకున్న పరిచయాలను ఇప్పుడు ఆమె సద్వినియోగం చేసుకుంటున్నారు.
యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో సంప్రదింపులు చేసే బాధ్యతను కేసీఆర్ కవితకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమె అఖిలేష్ తో చర్చలు జరుపుతూ కేసీఆర్ వ్యూహాలు అమలయ్యేలా చూస్తున్నారు. అదేవిధంగా గతంలో కేసీఆర్ ముంబై, జార్ఖండ్ వెళ్లిపుడు కూడా కవిత సీఎం వెంటే ఉన్నారు. తాజా ఢిల్లీ పర్యటనలోనూ కవితనే కేసీఆర్ అన్ని పనులను చక్కబెడుతున్నారు.
ఢిల్లీ కేంద్రంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ కు పీఆర్వోగా సంజయ్ కుమార్ ఝాను ప్రభుత్వం ఇటీవల నియమించింది. సంజయ్ నియామకంలోనూ కవిత క్రియాశీలంగా వ్యవహరించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ అయిన కవితను కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. కానీ ఆమెను కేసీఆర్ తనతోపాటు జాతీయ రాజకీయాల సమన్వయ కర్తగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. దీనిపై త్వరలోనే టీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కన్పిస్తోంది.