Rahul Gandhi Telangana Leaders Meeting: కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికలలో కేవలం కేరళ రాష్ట్రంలో మాత్రమే అధికారంలోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో అధికార పక్షంలో ఒక భాగమైంది. కీలకమైన పశ్చిమ బెంగాల్లో.. అస్సాంలో.. చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. కనీసం చెప్పుకునే స్థాయిలో శాసనసభ స్థానాలను దక్కించుకోలేకపోయింది.
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇప్పుడు వచ్చే వాళ్ళతో.. పోయే వాళ్లతో అత్యంత రద్దీగా ఉంది. రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున కార్గే.. వేణుగోపాల్ రెడ్డి వంటి వారితో నిత్యం సమావేశాలు పెడుతున్నారు. ఏం జరిగి ఉంటుంది.. ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నప్పుడే.. తెలంగాణ నేతలు అక్కడ కనిపిస్తున్నారు. కొద్దిరోజుల వరకు సాగిన కర్ణాటక పంచాయతీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడంతో ముగిసింది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ పంచాయతీ ప్రారంభమైంది. అలాగని తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు జరగడం లేదు. రేవంత్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకోవడం లేదు.
కాకపోతే కొంతమంది మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు.. తమ శాఖలలో పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నట్టు అధిష్టానానికి నివేదిక అందింది. ఇటీవల మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అధిష్టానం కొన్ని శాఖలలో ప్రక్షాళన చేయాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకుడు వెంటనే ఢిల్లీ చేరుకున్నారు. మంత్రులుగా ప్రమోషన్ సాధించాలి అనుకునేవారు రాహుల్ గాంధీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.
వారిలో ఇప్పటికే గడ్డం ప్రసాద్ తనకు మంత్రి పదవి కేటాయించాలని రాహుల్ గాంధీకి వినతిపత్రం అందించిన తెలుస్తోంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వంటి వారు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రిపై నేరుగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడుతున్నారు.
మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ నివాసంలో గాని.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాని కనిపించడం లేదు. ఇంతవరకు విజ్ఞప్తులు అందించినట్టు కూడా సమాచారం అందడం లేదు. అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా.. లేక మీడియాకు కాంగ్రెస్ పార్టీ లీకలు ఇస్తోందా.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొంత సమయం పడుతుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
