https://oktelugu.com/

Karimnagar: కరువు కోరల్లో కరీంనగర్‌..!

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈ యాసంగిలో సాగు చేసిన వరిలో ఇప్పటికే సుమారు 10 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. సిరిసిల్ల, మానకొండూర్, కరీంనగర్, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 4, 2024 2:21 pm
    Karimnagar in drought

    Karimnagar in drought

    Follow us on

    Karimnagar: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కరువుతో అల్లాడుతోంది. భూగర్భ జలాలు అడుగంటాయి. సాగునీటి కాలువలు నీరు లేక బోసిపోతున్నాయి. పంట చేలు నీరందక నెర్రెలుబారాయి. పంటలు ఎండుతున్నాయి. కళ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కొందరు బావుల్లో పూడిక తీస్తుండగా, మరికొందరు ట్యాంకర్లతో చివరి దశలో ఉన్న పంటలకు నీళ్లు అందిస్తున్నారు. ఇక నీటిని అందిచే అవకాశం లేని రైతులు చేలల్లో పశువులను మేపుతున్నారు. కడుపు మండి కొందరు రైతులు పంటకు నిప్పు పెడుతున్నారు.

    పదివేల ఎకరాల్లో పంట నష్టం..
    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈ యాసంగిలో సాగు చేసిన వరిలో ఇప్పటికే సుమారు 10 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. సిరిసిల్ల, మానకొండూర్, కరీంనగర్, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. ఎండిన పంటలకు రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేకుంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ నేతల పర్యటనలు
    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక పొలాలు ఎండిపోతుండడంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలు తెలుసుకునేందుకు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ఇటీవల పర్యటించారు. పంటలను పరిశీలించారు. కళ్లముందే ఎండుతున్న పంటను కాపాడుకోలేక దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ నాయకులు పంటలను పరిశీలించి రైతులను ఓదారుస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మండు వేసవిలోనూ చెరువులు మత్తడి దూకాయని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువుతో రైతులు ఇబ్బంది పడుతన్నారని ఆరోపిస్తున్నారు.

    రేపు కేసీఆర్‌ పర్యటన..
    సాగునీరు అందక పంటలు ఎండుతుండడంతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రైతులను పరామర్శిస్తున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో పర్యటించి నీరందక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. బాధిత రైతులను ఓదార్చారు. వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువని ఆరోపించారు. ఇక క్షేత్ర పర్యటనలో భాగంగా గులాబీ బాస్‌ ఏప్రిల్‌ 5న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిన రైతుల పంటలను పరిశీలించి ఓదార్చనున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిన పంటలను కేసీఆర్‌ పరిశీలించనున్నారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు.

    6న రాష్ట్రవ్యాప్త నిరసన..
    ఇక రాష్ట్రంలో కరువు పరిస్థితిపై తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్‌ 6న నిరసన తెలపాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈమేరకు దీక్షలు చేయాలని నిర్ణయించారు. కరువుతోపాటు, పంటలకు రూ.500 బోనస్, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఈ నిరసన చేపట్టనున్నట్లు గులాబీ నేతలు తెలిపారు.