MLA Katipally Venkataramana Reddy: 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం కామారెడ్డి. ఈ నియోజకవర్గంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేశారు. బిజెపి నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో కెసిఆర్ గెలుస్తారని అందరూ అనుకున్నారు. కెసిఆర్ అనుకూల మీడియా కూడా ఇదేవిధంగా మాట్లాడింది. గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ గెలవడం ఖాయమని స్వీయ కథనాలను రాసింది. కానీ ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చింది.
కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించి, రేవంత్ రెడ్డి ని ఓడించి విజయం సాధించారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో పరిస్థితి ఒక విధంగా ఉంటే.. తన నియోజకవర్గంలో మరో విధంగా ఉందని నిరూపించారు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి. ఎన్నికల సమయంలో కామారెడ్డి నియోజకవర్గంలో సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు వెంకటరమణ రెడ్డి. ఏకంగా 150 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని.. ఆయన అందులో పేర్కొన్నారు. పైగా కామారెడ్డి పట్టణానికి చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ప్రజలు స్థానికుడు.. సేవా తత్పరుడు.. ఎటువంటి వివాదాలు లేని వ్యక్తి కావడంతో వెంకటరమణారెడ్డికి జై కొట్టారు. తమ వాడిగా ఆయనను గెలిపించుకున్నారు. గులాబీ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ తాయిలాలు ఇచ్చినప్పటికీ వెంకటరమణారెడ్డికి అక్కడి ప్రజలు జై కొట్టారంటే ఆయన స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల కామారెడ్డి ప్రాంతంలో విపరీతంగా వరదలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో వెంకట రమణారెడ్డి పై కొన్ని మీడియా సంస్థలు కావాలని వ్యతిరేక కథనాలను రూపొందించాయి. అయినప్పటికీ వెంకటరమణారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అండగా ఉంటామని మాట ఇచ్చారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు నిత్యవసరాలు అందించారు. అయితే ఇప్పుడు వెంకటరమణారెడ్డికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.. ఈ క్రమంలో తనకు తాను నాయకుడిగా సున్నా మార్కులు వేసుకుంటున్నారని.. నియోజకవర్గ అభివృద్ధికి ఏమీ చేయలేదని వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న అనేక కారణాలను ఆయన విశ్లేషించారు. అయితే గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా మాత్రం వెంకట రమణారెడ్డి మాట్లాడిన ఆ ఒక్క మాటను మాత్రమే ఎడిట్ చేసి తనకు అనుకూలంగా వాడుకుంటున్నది. కామారెడ్డి లో కెసిఆర్ ను వెంకటరమణారెడ్డి ఓడించడంతో.. దానిని మనసులో పెట్టుకొని నెగటివ్ ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో కాషాయ పార్టీ నాయకులు కూడా గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియాకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి గులాబీ పార్టీ సోషల్ మీడియా ఎన్ని రకాలుగా దిగజారాలో.. అన్ని రకాలుగా దిగజారుతోంది. నాయకుల మీద వ్యక్తిగత విష ప్రచారం చేయడంలో ఆ పార్టీ సోషల్ మీడియా ఇటీవల మరింత బరితెగించిందని కమలం పార్టీ నాయకులు అంటున్నారు.
కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో నేను విఫలమయ్యాను
ఎమ్మెల్యేగా నాకు నేను సున్నా మార్కులు వేసుకుంటా
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Video Credits – KR Tv pic.twitter.com/diGYv3omVk
— Telugu Scribe (@TeluguScribe) October 27, 2025