Kalvakuntla Kavitha: గులాబీ క్యాంపు నుంచి బయటికి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత తన స్వరాన్ని ప్రతిరోజు తీవ్రం చేస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా జాగృతి జనం మాట కార్యక్రమాన్ని చేపట్టిన ఆమె.. ఇప్పుడు వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత పది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ చేసిన అక్రమాలను బయటపెడుతున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన కవిత.. ఇప్పుడు తన తండ్రిని, సోదరుడిని కూడా వదిలిపెట్టడం లేదు.
ఇటీవల తన భర్త మీద నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బిజెపి ఎమ్మెల్యే, టీ న్యూస్ కు లీగల్ నోటీసులు పంపించారు. తనకు, తన భర్తకు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం కేసు పెడతానని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగానే.. తన సోదరుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు వివిధ పరిశ్రమల అధిపతులు అడ్డగోలుగా సంపాదించిన తీరు.. వారికి తన సోదరుడు వత్తాసు పలికిన తీరును కూడా కవిత ఇటీవల బయటపెట్టారు. సహజంగానే కవిత గులాబీ క్యాంప్ నుంచి తీవ్రమైన నిరసన ఎదుర్కొంటున్నారు. కొంతమంది నేతలయితే కవితను ఉద్దేశించి దారుణంగా మాట్లాడుతున్నారు. ఇటీవల మాధవరం కృష్ణారావు ఏక వాక్యంతో కవితను సంబోధించారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కవిత చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
ఇవి ఇలా ఉండగానే కవిత సోషల్ మీడియాలో సోమవారం మరో బాంబు పేల్చారు. #askkavitha అనే యాష్ ట్యాగ్ తో తనను ఏమైనా అడగొచ్చని నెటిజన్లతో పేర్కొన్నారు. కవిత ఇచ్చిన ఈ అవకాశాన్ని నెటిజన్లు సద్వినియోగం చేసుకున్నారు. మెజారిటీ నెటిజన్లు కేటీఆర్ అక్రమాల గురించి ప్రస్తావించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల వ్యాపారవేత్తలు అడ్డగోలుగా భూములు తీసుకున్నారని.. వాటిపై మాట్లాడతారా అంటూ కవితను ఉద్దేశించి నెటిజన్లు ప్రస్తావించారు. కొంతమంది నెటిజన్లు మీ చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకుంటారా అంటూ అడిగారు.. అయితే కవిత ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. బహుశా నెటిజన్లు నుంచి ఈ స్థాయి స్పందన వస్తుందని ఆమె ఊహించి ఉండరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
It’s time for #AskKavitha.
Share your questions and thoughts with #AskKavitha
Will answer them today at 4 PM on X pic.twitter.com/ZQMKB7yQik
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025