BJP Madhavi Latha: గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ప్రధానంగా మీడియాలో హైదరాబాద్ నుంచి పోటీ చేసిన మాధవి లత గురించి చర్చ జరిగింది. హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ ఓవైసీ మీద ఆమె పోటీ చేశారు. బిజెపి అభ్యర్థిగా వినూత్నమైన విధానంలో ప్రచారం చేశారు. పైగా మాధవి లతకు సొంతంగా ఒక ఆసుపత్రి కూడా ఉంది. సమాజంలో పలుకుబడి కూడా విపరీతంగా ఉంది. అటువంటి మహిళను హైదరాబాద్ ఓటర్లు గెలిపించుకుంటారని అందరూ అనుకున్నారు. స్వయంగా హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా మాధవి లత గురించి ప్రస్తావించారు. వాస్తవానికి ఎన్నికల్లో ఫలితం బిజెపికి అనుకూలంగా వస్తుందనుకుంటే.. మాధవి లత ఊహించని విధంగా హైదరాబాద్ ఓటర్లు తీర్పు ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఓటమి తర్వాత కొంతకాలం పాటు ఆమె పెద్దగా కనిపించలేదు. ఇటీవల కాలంలో తన ఆసుపత్రిలో తగ్గించిన ఫీజుల గురించి ఆమె ఒక వీడియోలో మాట్లాడారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ శాసనసభకు ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి తరఫున ఆమె ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను వెళ్లి నేరుగా కలుస్తున్నారు. ఈ క్రమంలో బిజెపికి ఓటు వేయాలని.. హైదరాబాద్ నగర రూపురేఖలు బిజెపి ద్వారానే మారుతాయి అని ఓటర్లను కోరుతున్నారు. ఆమె రాజకీయ నాయకురాలు కాబట్టి.. పైగా బీజేపీలో ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో అలా ప్రచారం చేయడం సర్వసాధారణం. అయితే మాధవి లత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మీడియాలో కూడా ప్రముఖంగా కనిపిస్తారు కాబట్టి.. ఆమె గురించి సహజంగానే ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. పైగా స్వయంగా ఆమె ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆమెతో మాట్లాడేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆమెను కొంతమంది ఓటర్లు టార్గెట్ చేయడమే ఇక్కడ అసలైన విషాదం.
మాధవి లత ప్రచారానికి వెళ్తున్న సమయంలో జూబ్లీహిల్స్ ఓటర్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మోడీ మా ఖాతాలో డబ్బులు వేస్తానని చెప్పారని.. కానీ ఇంతవరకు వేయలేదని ఓటర్లు ఆమెను ప్రశ్నిస్తే.. వివిధ పథకాల ద్వారా మీ ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయి కదా అని మాధవి లత సమాధానం చెప్పారు. అయితే ఆ పథకాలు తమదాకా రావడంలేదని ఓటర్లు అన్నారు. క్రితం ఎన్నికల్లో మీకే ఓటు వేశామని మెజారిటీ ఓటర్లు మాధవి లతతో చెప్పారు. దానికి ఆమె ఏ గుర్తుకు ఓటు వేశారని అడిగితే.. కారు గుర్తు అని చెప్పారు. కారు గుర్తు తమది కాదని.. తమది కమలం అని చెబితే.. ఏ గుర్తుకు ఓటు వేసినా పెద్దగా ప్రయోజనం లేదని ఓటర్లు పెదవి విరిచారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి అభివృద్ధి చేశారని.. మీరు ఏం చేస్తారో చెబితే ఓటు వేస్తామని ప్రజలు మాధవి లతను ప్రశ్నించారు. దానికి ఆమె ఆలోచించుకుని చెబుతామని అన్నారు. అలాంటప్పుడు మీరు మా వద్దకు ఎందుకు వచ్చారని కొంతమంది ఓటర్లు ప్రశ్నించారు. దీంతో ఆమె వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. వేగంగా వచ్చేశారు.