Mohammed Anwar Passes Away: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలైంది. బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ఇక్కడ పోటీ చేశాయి. మూడు పార్టీలకు సంబంధించిన ప్రధాన నేతలు మొత్తం ప్రచారం చేశారు. నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు చేసుకున్నారు. ఆరోపణలలో సరికొత్త రికార్డు సృష్టించుకున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా వదిలిపెట్టకుండా ఇష్టానుసారంగా తిట్టుకున్నారు.
హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో పోలింగ్ ఆశించిన స్థాయిలో నమోదు కాకపోయినప్పటికీ.. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తుందని ప్రకటించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను భారత రాష్ట్ర సమితి తప్పు పట్టింది. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం వేరే విధంగా ఉందని.. అంతమంది ప్రజల అభిప్రాయాన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఎలా ప్రభావితం చేస్తాయని పేర్కొంది. మరోవైపు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ పరిపాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండం అని కేటీఆర్ అన్నారని.. ఇప్పుడు ఫలితం కూడా తమకు అనుకూలంగా వస్తుందని.. ప్రచారంలో తాను అన్న మాటలకు కేటీఆర్ కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజవర్గంలో జరిగిన ఉప ఎన్నికలకు కౌంటింగ్ శుక్రవారం జరుగుతోంది. దీనికంటే ముందుగానే ఆ నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) గురువారం రాత్రి కన్నుమూశారు. ఎర్రగడ్డలో ఆయన నివాసం ఉంటారు. ఈయన అక్టోబర్ 22న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ ను యాక్సెప్ట్ చేశారు. దీంతో ఆయన పోటీలో నిలిచారు. అయితే ఫలితాలకు ఒక రోజు ముందుగానే మహమ్మద్ అన్వర్ మరణించడంతో.. ఆయన అనుచరుడు ఒకసారిగా విషాదంలో మునిగిపోయారు.
అన్వర్ ఎర్రగడ్డ ప్రాంతంలో చాలామందికి సుపరిచితుడు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై ఆయన అనేకసార్లు అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. నిరసనలలో పాల్గొన్నారు. అన్వర్ గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన గుండె పని చేయడం ఆగిపోయింది. దీంతో ఆయన కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన మృతి నేపథ్యంలో కౌంటింగ్ వాయిదా పడుతుందని వార్తలు వచ్చినప్పటికీ.. వాటిని ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు.