KCR key decision: జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో జరిగిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఊహించని ఓటమిని ఎదుర్కొంది.. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి మొదలుపెడితే పోలింగ్ వరకు గులాబీ పార్టీ అన్ని శక్తులను ఉపయోగించింది. ప్రచారాన్ని కొత్త విధంగా కొనసాగించింది. విమర్శలు చేయడంలో.. ప్రభుత్వ విధానాలను ఎండబెట్టడంలో విభిన్నమైన ధోరణి ప్రదర్శించింది.. అయినప్పటికీ చివరి దశలో వెనుకంజ వేసి ఓటమిపాలైంది..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా కాలికి బలపం కట్టుకుని తిరిగారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ప్రచార పర్వంలో ముందుండి నడిచారు.. పోలింగ్ చివరి వరకు కూడా నిత్యం పర్యవేక్షించారు. తద్వారా చేయి జారిపోయిందనుకున్న జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకున్నారు. వాస్తవానికి ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు లేదు. 2009లో పిజిఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచిన తర్వాత.. దాదాపు 16 సంవత్సరాల వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు.. అయితే ఇక్కడ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వినూత్నంగా ప్రచారం చేసి అద్భుతమైన గెలుపును సాధించుకున్నారు. తద్వారా ప్రభుత్వానికి ప్రజల్లో పరపతిని పెంచారు. రేవంత్ నాయకత్వం మీద ప్రజల్లో ఇంకా నమ్మకం ఉందని భరోసా కలిగించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఓటమి ఎదురైన నేపథ్యంలో గులాబీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వం పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కుమార్ కవిత ట్విట్టర్లో కర్మ హిట్స్ బ్యాక్ అని ఒక ట్వీట్ చేశారు. దీనిని బట్టి గులాబీ పార్టీలో.. కెసిఆర్ కుటుంబంలో ఎంతటి అంతర్గత కలహాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. పార్టీ ఇలానే ఉంటే ఇబ్బంది తప్పదని భావించిన గులాబీ సుప్రీం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుపెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకు గులాబీ పార్టీ వరుసగా కూటములు ఎదుర్కొంటూనే ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అందువల్లే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇబ్బంది ఎదురు కాకముందే.. పార్టీ పుట్టి మునగక ముందే.. సమూలంగా ప్రక్షాళన చేయాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు అడ్ హక్ కమిటీలతో పార్టీని నడిపించిన కేసీఆర్.. రాష్ట్ర స్థాయి వరకు కొత్త నాయకత్వాన్ని నియమిస్తారని తెలుస్తోంది. ఆ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీకి ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. అలాంటప్పుడు పరిస్థితి ఇలానే కొనసాగితే పార్టీ మనుగడ కష్టం అవుతుంది అని భావించిన కెసిఆర్.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారానికి కెసిఆర్ రావలసి ఉండేది. పార్టీ కార్యకర్తలు కూడా ఆయన ప్రచారం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అయినప్పటికీ ఆయన దర్శన భాగ్యం కలగలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో సునీతకు గెలిచే అవకాశం దక్కలేదు.