Jubilee Hills by-election BJP strategy : తెలంగాణలో జూబ్లీ్లహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ కసరత్తు మొదలు పెట్టాయి. బీఆర్‌ఎస్ అందరికన్నా ముందే అభ్యర్థిని ఖరారు చేసింది. సిట్టింగ్ స్థానం కావడంతో మాగంటి గోపీనాథ్ భార్యను అభ్యర్థిగా బరిలో దింపుతోంది. ఇక కాంగ్రెస్ కాస్త ఆలస్యంగా బీసీ అభ్యర్థిని రంగంలోకి దించింది. బీజేపీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థిని ఖరారు చేయలేదు. బలమైన ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ, పోటీకి సరైన అభ్యర్థి ఎంపికలో, ప్రచారంలో చురుకుదనం చూపకపోవడం వెనుక అనుమానాలు పెరుగుతున్నాయి.
గ్రౌండ్ వర్క్ లేకుండా ముందుకు..
ఉపఎన్నికపై స్పష్టత ఉండడంతో ప్రధాన పక్షాలు ప్రచార రంగంలోకి దిగాయి. కానీ, బీజేపీ మాత్రం అభ్యర్థి ఖరారు చేయకుండా సైలెంట్‌గా ఉంది. నామినేషన్లు మొదలయ్యే సమయంలో కూడా ముమ్మర కసరత్తు చేయకపోవడం, ఆ పార్టీ మద్దతుదారులకు అసహనం కలిగిస్తోంది. ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్‌కు చెందిన బొంతు రామ్మోహన్‌ను ఆహ్వానించే ప్రతిపాదన చేయడం, బీజేపీ తీరుపై మరిన్ని ప్రశ్నలను రేపుతోంది.
బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చేందుకే?
పార్టీ అంతర్గత చర్చల ప్రకారం, బీజేపీ వ్యూహం ప్రత్యక్ష పోరాటం కాకుండా ప్రత్యర్థిని బలహీనపరచడంపై కేంద్రీకృతమై ఉండవచ్చు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటు శాతం తగ్గి, బీజేపీ లాభపడింది. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కుంటే, అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పార్టీపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. బీజేపీ తక్కువ తీవ్రతతో పోటీ చేసి, బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా కుదేలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రహస్య ఒప్పందమా?
కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారాన్ని భిన్నంగా చూస్తోంది. బీజేపీ, టీడీపీ కలిసి బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నాయని, కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి ఉపఎన్నికను వేదికగా మలుస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తోంది. పోటీలో బీజేపీ సైలెంట్‌గా ఉండటం, కాంగ్రెస్‌కు నష్టంగా మారే గేమ్ ప్లాన్‌గా భావిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ నిశ్చితమైన పోరాటం చేపట్టకపోవడంతో పోటీ కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మధ్యే ఉండే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ బలహీనపడటం లేదా కాంగ్రెస్‌పై వ్యతిరేక వాతావరణం పెరగడం. ఏది జరిగినా, ఈ వ్యూహం భవిష్యత్తు ఎన్నికల్లో ప్రధాన సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.