Jubilee Hills By Election Result: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారి తీసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ మొదలైంది. అందరూ ఊహించినట్టుగానే ఇక్కడ ఫలితం వచ్చే విధంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ సంస్థల అంచనాలు కూడా నిజమయ్యే విధంగా తెలుస్తోంది. ఇక్కడ సుమారు నాలుగు లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. ఇంతమంది ఓటర్లు ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.
పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విజయం మీద ఏమాత్రం నమ్మకాన్ని వదులుకోలేదు. మరోవైపు భారత రాష్ట్ర సమితి కూడా తాము గెలుస్తామని భరోసా వ్యక్తం చేసింది. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తప్పు అని ప్రకటించింది. కౌంటింగ్ రోజు తమ ఊహించిన విధంగానే ఫలితం వస్తుందని.. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని భారత రాష్ట్ర సమితి ఆశాభావం వ్యక్తం చేసింది.
శుక్రవారం ఓట్ల కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ లో భాగంగా 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. ఇందులో నవీన్ యాదవ్ లీడింగ్ లో ఉన్నారు. మొత్తం ఓట్ల లెక్కింపును 10 రౌండ్లలో పూర్తి చేయబోతున్నారు. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడింగ్ లో ఉన్నారు. దీంతో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ఆశాభావంతో ఉంది. భారీ మెజారిటీతో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మొత్తం నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరందరికీ కూడా ఎన్నికల సంఘం పోలింగ్ చీటీలను పంపిణీ చేసింది. అయినప్పటికీ 1,94,631 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. సెలవులు ప్రకటించినప్పటికీ ఓటర్లు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోకపోవడం పట్ల ఎన్నికల సంఘం అధికారులు ఒక రకమైన నిర్వేదాన్ని వ్యక్తం చేశారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవడంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయవంతమైన నేపథ్యంలో.. తదుపరి రౌండ్లలో కూడా ఇదే ఫలితం వస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. తద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం బయట కాంగ్రెస్ నేతలు హడావిడి చేస్తున్నారు.. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.