Jubilee Hills by-election: తెలంగాణలో జూబ్లీహిల్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ప్రచార జోరు పెంచాయి. నవంబర్ 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ ప్రచారంలో వినూత్న పద్ధతులు అవలంబిస్తోంది. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా కేటీఆర్ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల మధ్య ఎండగడుతున్నారు. ఇక అధికార కాంగ్రెస్ ఇక్కడ గెలిచి హైదరాబాద్‌పై పట్టు సాధించాలని భావిస్తోంది. ఇక బీజేపీ కూడా తర్వాత అధికారం తమదే అని నిరూపిచాలంటే.. జూబ్లీహిల్స్ గెలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలు ఇక్కడి ఓటర్లకు కూడా ఓపరీక్షగా మారాయి. జూబ్లీహిల్స్ రెండు సార్లు విజయాన్ని అందుకున్న బీఆర్‌ఎస్ ఈసారి ప్రజలకు చేసిన అభివృద్ధి పనుల జాబితాను చూపిస్తూ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. రహదారులు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, ప్రజా సేవల విస్తరణ అనే అంశాలను ప్రధానంగా ప్రచారంలో వినిపిస్తోంది. పేదలకు అండగా, ధనికులకు సౌకర్యాలుగా రెండు వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పుకుంటోంది.
ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రచారం..
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, జూబ్లీహిల్స్‌లో మాత్రం ప్రత్యక్ష పనుల కంటే విమర్శలపై దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి లేకుండా పోయిందని చెబుతూ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని చూస్తోంది. గెలిస్తే పనులు చేస్తామని నమ్మకం కల్పించే ప్రయత్నంలో ఉంది. కానీ ఇప్పటిదాకా చేసిన పనుల జాబితా లేకపోవడం ఓటర్లలో చర్చనీయాంశమవుతోంది.
జాతీయ బలంపై బీజేపీ ప్రచారం..
బీజేపీ జూబ్లీహిల్స్‌ను తెలంగాణలో ఎదుగుదలకు ప్రారంభ వేదికగా చూస్తోంది. ‘‘దేశవ్యాప్తంగా మేము పాలిస్తున్నాం, తెలంగాణలో కూడా ఎదగాలంటే ఈ సీటు అవసరం’’ అనే నినాదంతో ప్రచారం చేస్తోంది. స్థానిక అభ్యర్థి కన్నా పార్టీ బ్రాండ్ ప్రభావంపై ఆధారపడుతున్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది.
అభివృద్ధికా, అవకాశానికా?
ఓటర్ల ముందున్న ప్రధాన ప్రశ్న – బీఆర్‌ఎస్ గతంలో చెప్పిన అభివృద్ధి నిజమా, కాదా? కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్నందున నిధుల ప్రాధాన్యం దృష్టిలో ఉంచి ఓటు వేస్తారా? లేక జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీకి స్థానికంగా అవకాశమివ్వాలా? అనే మూడు కోణాలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల గమ్యాన్ని నిర్ణయిస్తాయి. జూబ్లీహిల్స్ ఓటర్ ధోరణి నగరంలో రాబోయే ఎన్నికల దిశను సూచిస్తుంది. రాజకీయ పార్టీలు వాగ్దానాల సుదీర్ఘ జాబితా కంటే ప్రజలు చూసిన అభివద్ధినే తూకం వేస్తేనే ఈ పోరు ప్రజాస్వామ్య శక్తిని సార్థకం చేస్తుంది.