Jalagam Venkat Rao: ఖమ్మం కాంగ్రెస్‌కు కంచుకోట.. దశాబ్దకాలంగా బీఆర్‌ఎస్‌కు చిక్కని జిల్లా.. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని జిల్లాలపై పట్టు సాధించిన బీఆర్‌ఎస్.. ఖమ్మంలో మాత్రం గెలుపు అందుకోలేకపోతోంది. ఈసారి ఖమ్మంలో సత్తా చాటాలని కాంగ్రెస్.. మెజారిటీ స్థానాల్లో గెలవాలని బీఆర్‌ఎస్ తలపడుతున్నాయి. నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలకు షాక్ ఇచ్చారు.. సీనియర్ నేత జలగం వెంకట్రావు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలని సీనియన్ నేత డిసైడ్ అయ్యారు. ఇది కాంగ్రెస్–సీపీఐ కూటమికి, బీఆర్‌ఎస్ నాయకులకు ఆందోళన కలిగించే అంశంగా మారిందని చెప్పవచ్చు.
పొత్తులో సీపీఐ పోటీ..
కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బరిలోదిగుతున్నారు. ఆయన కాంగ్రెస్–సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే నామమాత్రంగా ఉన్న సీపీఐ క్యాడర్‌ను అవలీలగా అధిగమించవచ్చు అని భావించిన బీఆర్‌ఎస్‌కు జలగం బరిలో ఉంటారనేది మింగుడుపడటం లేదు. తాను చేసిన అభివృద్ధి పనులు చూపిస్తూ జలగం ప్రచారం చేయనున్నారు.
‘జలగం’ రాకతో మారిన సమీకరణలు..
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఎన్నికలకు జలగం సిద్ధం అయినట్లు హడావుడి మొదలైన నుంచి నేడో రేపో తమ నాయకుడు వస్తాడని ఎదురు చూసిన జలగం అభిమానులకు తీయటి కబురు అందించారు. పార్టీ జెండా లేకున్నా కచ్చితమైన ఎజెండాతో పోటీ చేస్తున్న జలగం వెంకట్రావును గెలిపించుకొని తీరుతామని అభివృద్ధి కోరే ప్రజలు అభి మానులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత 2014లో టీఆర్‌ఎస్ నుంచి గెలుపొం దిన జలగం వెంకట్రావు 2018 లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి అయిన వనమా వెంకటేశ్వరరావుపై కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఓటమి అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతూ కాంట్రవర్సీకి దూరంగా ఉంటూ తనకున్న క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు..
‘జలగం’ హయాంలో అభివృద్ధి
2014లో జలగం వెంకట్రావు గెలుపొందిన అనంతరం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల మన్ననలు పొందారు. నియోజకవర్గంలో సెంట్రల్ పార్క్ నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్, కిన్నెరసాని అభివృద్ధి కార్యక్రమాలు, సందు గొందుల్లో సీసీ రోడ్లు, యువత ఉద్యోగ సాధన కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, విద్యార్థులకు పేదలకు పౌష్టిక ఆహారం అందాలని భావనతో అక్షయపాత్ర వంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపట్టారు. రౌడీయిజానికి, చిల్లర మూకలకు మద్దతు పలకకుండా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. యువత పెడదారి పట్టకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
అభిమానుల్లో జోష్..
కొత్తగూడెం బరిలో జలగం వెంకట్రావు దిగుతున్నారని తెలియడంతో క్యాడర్‌లో జోష్ పెరిగింది. కాంగ్రెస్ తరఫున జలగం పోటీ చేస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ పొత్తు కోసం ఆ స్థానాన్ని కాంగ్రెస్ తప్పనిసరిగా సీపీఐకి కేటాయించాల్సి వచ్చింది. ఇదే కాంగ్రెస్ ఓటమికి దారితీయడం ఖాయమని నియోజకవర్గ ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ అతిపెద్ద తప్పు చేసిందని అంటున్నారు. దీంతో గెలిచే సీటును పోగొట్టుకుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కూడా ఇక తమకు ఎదురు లేదని భావించింది. ఈ క్రమంలో జలగం ఎంట్రీ కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన అభిమానులు ఆయన వస్తున్నారన్న వార్త విని సంబురాలు చేసుకుంటున్నారు. జలగం ఎమ్మెల్యే అయితే కొత్తగూడెం నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకత, జలగం చేసిన అభివృద్ధి పనులు అవలీలగా గెలిపిస్తాయని యన అభిమానులు, ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.