https://oktelugu.com/

YS Jagan-Revanth Reddy : లోగుట్టు తెలియక జగన్ తలవంచాడు.. సరైన సందర్భం గుర్తించి రేవంత్ హీరో అయ్యాడు..

రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి.. అందుకే రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత చింతించి లాభం ఉండదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 27, 2024 / 07:14 PM IST

    YS Jagan- Revanth Reddy

    Follow us on

    YS Jagan-Revanth Reddy :  తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేత దర్జాగా సాగిపోతోంది. భారత రాష్ట్ర సమితి, ఒక సెక్షన్ పింక్ బుద్ధి జీవులు మినహా మిగతా వారెవరూ హైడ్రా పనితీరును తప్పు పట్టడం లేదు. పైగా ఇటీవల హైడ్రా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టింది. ఇదే ఎన్కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ నిర్మాణమని గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.. దానిని ఎందుకు పడగొట్టడం లేదని నాడు శాసనసభలో కేసీఆర్ ను నిలదీశారు. నాగార్జునతో మీకు ఏమైనా లోపాయ కారి ఒప్పందాలు ఉన్నాయని ప్రశ్నించారు.. అధికారంలోకి రాగానే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను రేవంత్ రెడ్డి పడగొట్టించారు.. ఈ అక్రమ కట్టడాల కూల్చివేత ద్వారా రేవంత్ ఒకసారిగా తన పాపులారిటీ పెంచుకున్నారు. తిరుగులేని హీరో గా అవతరించారు.. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞప్తికి తీసుకోవాలి.. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇల్లు నిర్మించుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఆ ఇల్లు కృష్ణానది లోపల ఉంది. దానిపై జగన్ ప్రభుత్వం చర్యలకు దిగగానే.. టిడిపి అనుకూల మీడియా, టిడిపి నాయకులు రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు.. దీంతో చంద్రబాబుకు ప్రజల్లో మైలేజీ పెరిగింది. సానుభూతి వ్యక్తం అయింది..

    రేవంత్ ను కీర్తించడం పెరిగిపోయింది

    ఇదే సమయంలో రేవంత్ రెడ్డి నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టగానే రేవంత్ రెడ్డిని కీర్తించడం పెరిగిపోయింది.. వాస్తవానికి చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మించుకున్న ఇంటిని మొత్తం జగన్ ప్రభుత్వం కూల్చలేదు. కేవలం రెండు అడుగులకు సంబంధించిన గోడలను మాత్రమే పడగొట్టింది. దానిని అప్పట్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు లాంటివారు కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. తెలంగాణలో నాగార్జున నిర్మించుకున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమని ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కాగానే దానిని పడగొట్టించారు. ఫలితంగా ఒక్కసారిగా హీరో అయిపోయారు.

    మీడియా ప్రచారం వల్ల..

    నాడు కృష్ణా నదిలోఅందుబాటులో చంద్రబాబు ఇంటిని నిర్మిస్తే.. దానిని పడగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళితే.. జరిగిన ప్రచారం వల్ల జగన్ విలన్ అయ్యారు. సొంత పత్రిక ఉన్నప్పటికీ జగన్ మైలేజీ పెంచుకోలేకపోయారు. వాస్తవానికి జగన్ చేతిలో సొంత మీడియా మాత్రమే ఉండడం వల్ల ఆయనకు సానుకూల ప్రచారం పెద్దగా రాలేదు. ఆ సమయంలో చంద్రబాబుకు అటు ఆంధ్రజ్యోతి, ఇటు ఈనాడు బాసటగా నిలిచాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్ వంటివి మౌత్ పీస్ లుగా మారిపోయాయి. వాస్తవానికి జనాలకు వీటిపై న్యూట్రల్ మీడియా అనే పేరు ఉంది. అందువల్లే కాస్తో కూస్తో చంద్రబాబుకు లాభం చేకూర్చింది. అందువల్లే చేతిలో బలమైన మీడియా ఉండగానే సరిపోదు.. ఇతర మీడియాను కూడా అనుకూలంగా మలుచుకోవాలి. అప్పుడే ఎలాంటి పని చేసినా అద్భుతమైన ప్రచారం దక్కుతుంది. ఇలాంటి వ్యవహారాలు లక్షల కోట్లు ఖర్చుపెట్టినా జరగవు. అంటే ఇక్కడ మీడియాకు సార్ధకత ఎక్కడిది? సోషల్ మీడియా బలంగా మారిన ఈ రోజుల్లో మీడియాను ఎవరు నమ్ముతారు? అనే ప్రశ్నలు ఉదయించవచ్చు.. కానీ ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల.. జనాల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం వల్ల అది నిజంగా చెలామణి అయ్యే అవకాశం లేకపోలేదు.