MLC Kavitha: కవిత ఇంటిపై ఐటీ రైడ్స్‌.. లోక్‌సభ ఎన్నికల ముందు కీలక పరిణామం?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఇప్పటికే ఈడీ, సీబీఐ ముద్దాయిగా చేర్చాయి. విచారణకు రావాలని ఈడీ ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయితే తన పిటిషన్‌ సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నందున తాను విచారణకు రాలేనని కవిత తప్పించుకుంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : March 15, 2024 3:22 pm

MLC Kavitha

Follow us on

MLC Kavitha: ఒకవైపు లోక్‌సభ ఎన్నిల షెడ్యూల్‌కు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్‌ విడదుల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, నిజామాబాద్‌ స్థానికసంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై శుక్రవారం(మార్చి 15న) ఐటీ దాడులు చేసింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఇప్పటికే ఈడీ, సీబీఐ ముద్దాయిగా చేర్చాయి. విచారణకు రావాలని ఈడీ ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయితే తన పిటిషన్‌ సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నందున తాను విచారణకు రాలేనని కవిత తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఐటీ దాడులు జరుగడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అంతా రహస్యంగా..
ఇక కవిత ఇంటిపై ఐటీ, ఈడీ సంయుక్తంగా రైడ్స్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరు వచ్చారు. ఎంత మంది వచ్చారు అనే విషయం మాత్రం తెలియడంలేదు. బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి చేరగానే అధికారులు కవితతోపాటు, ఆమో ఇంట్లోని కుటుంబ సభ్యులు, వర్కర్ల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె ఇంటిపై రైడ్స్‌ గురించి బయటకు రాలేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కవిత ఇంటిపై ఐటీ, ఈడీ రైడ్స్‌ జరుగుతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది.

కవిత మినహా అంతా అరెస్ట్‌..
ఢిల్లీ లిక్కర్‌ కేసులో సౌత్‌ గ్రూపు తరఫున కవిత కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ, సీబీఐ చార్జిషీట్‌లో ప్రకటించాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్‌ అయ్యారు. కొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు. కొందరు అప్రూవర్‌గా మారారు. కేవలం కవిత విషయంలో మాత్రమే జాప్యం జరుగుతోంది. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంతో తాజాగా దాడులు చేయడం చర్చనీయాంశమైంది.

రెండుసార్లు విచారణ, ఫోన్లు స్వాధీనం..
ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్‌ స్కాం విషయంలో కవితను ఈడీ ఇప్పటికి రెండుసార్లు విచారణ చేసింది. తర్వాత కవిత 12 ఫోన్లు ధ్వంసం చేసినట్లు చార్జిషీట్‌లో అభియోగం మోపింది. అయితే కవిత తాను ఫోన్లు ధ్వసం చేయలేదని, సుమారు 12 ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించింది. తర్వాత ఈడీ సుదీర్ఘ విచారణతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఈడీ విచారణకు రావాలని రెండుసార్లు నోటీసులు ఇచ్చింది. కానీ కవిత హాజరు కాలేదు. ఈ క్రమంలో ఐటీ, ఈడీ దాడులు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.