https://oktelugu.com/

RK kothapaluku : ఓహో సినీ తారలు దిగివచ్చింది.. రేవంత్ ను కలిసింది అందుకేనా?

తెలుగు జర్నలిజంలో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఏ విషయమైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. ఒక చంద్రబాబు విషయం మినహా.. మిగతా అన్నింటిలో తన ధైర్యాన్ని చూపిస్తాడు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు విషయంలోనూ ఏమీ దాచుకోలేదు. అల్లు అర్జున్ మీద పడిపోయాడు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెనకేసుకొచ్చాడు. అల్లు అర్జున్ కు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించడానికి సిల్లి వ్యవహారంగా రాధాకృష్ణ రాసుకు వచ్చాడు.. ఇలాంటి సిల్లీ తప్పులు చేయడం అలవాటేనని వ్యాఖ్యానించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 29, 2024 / 05:33 PM IST

    CM Revanth Reddy(7)

    Follow us on

    RK kothapaluku : ఈరోజు నాటి కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ చుట్టే తిరిగారు. పుష్ప -2 వివాదం.. రేవంత్ వ్యవహరించిన తీరు.. శాసనసభలో చేసిన ప్రకటన.. ఆ తర్వాత పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖులతో రేవంత్ భేటీ.. ఆ తదుపరి జరిగిన పరిణామాలను తనదైన కోణంలో రాధాకృష్ణ విశ్లేషించాడు. ఈ విశ్లేషణలో కొత్తదనం ఏమీ లేకపోయినప్పటికీ.. కొన్ని విషయాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.. పుష్ప సినిమాకి 300 కోట్లు అల్లు అర్జున్ తీసుకున్నాడని.. 150 కోట్లు సుకుమార్ తీసుకున్నాడని.. ఇలా దర్శకుడు, హీరో అన్నేసి కోట్లు తీసుకోవడం వల్లే సినిమా టికెట్లు పెంచాల్సి వచ్చిందని.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి సపోర్ట్ ఇవ్వడం సరికాదని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో కథా బలమున్న సినిమాలు నిర్మాణం అవుతున్నాయని.. తెలుగు చిత్రపరిశ్రమకు వచ్చేసరికి అలాంటి పరిస్థితి ఉండడం లేదని రాధాకృష్ణ వాపోయాడు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ లాంటి వ్యక్తులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన నటీనటులను తెలంగాణ నుంచి వెళ్లిపోమని చెప్పడాన్ని రాధాకృష్ణ తప్పు పట్టాడు. నాడు మర్రి చెన్నారెడ్డి లాంటివాళ్ళు పట్టు పట్టడం వల్లే తమిళనాడు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చిందని.. స్టూడియోలకు భూములు.. నటీనటులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికేనని.. ఇలాంటివారిని రేవంత్ రెడ్డి అదుపులో పెట్టాల్సిన అవసరం ఉందని రాధాకృష్ణ పేర్కొన్నాడు. అంతేకాదు పుష్ప సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడాన్ని రాధాకృష్ణ తప్ప పట్టారు. అందువల్లే ఈ వివాదం జరిగిందని వ్యాఖ్యానించారు. దీంతో ఒళ్ళు మండిన రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇక్కడ దాకా తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. అయితే వేడి మీద ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చల్లబరచడానికే సినీ ప్రముఖులు ఆయన శరణు జొచ్చారని రాధాకృష్ణ పేర్కొన్నాడు. ఇంత హితో ఉపదేశం చేసిన రాధాకృష్ణ.. నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. చిత్ర ప్రముఖులు ఆయనను కలవడానికి వెళ్ళినప్పుడు.. జరిగిన సంఘటనను మాత్రం మరో విధంగా రాస్కొచ్చాడు. మరి నేడు అదే రాధాకృష్ణ చిత్ర పరిశ్రమలోని వ్యక్తులను విమర్శిస్తూ కొత్త పలుకు రాయడం నిజంగానే హాస్యాస్పదం..

    ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంది

    తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉండవు. ఆ కోట్ల దందా, డెమీ గాడ్ వ్యవహారం.. బెనిఫిట్ షోల బండారం.. టికెట్ల పెంపు దుర్మార్గం అన్నీ తెలుసు. ఆయనప్పటికీ పుష్ప సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలు వేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని రాధాకృష్ణ ఒక మాట కూడా అనలేదు. ఎంతసేపు చిత్ర పరిశ్రమ, అల్లు అర్జున్ గురించి మాత్రమే రాధాకృష్ణ మాట్లాడాడు. అంటే ఇక్కడ చిత్ర పరిశ్రమ శుద్ధ పూస అని.. అల్లు అర్జున్ అమాయకుడని చెప్పడం లేదు.. ఒక జర్నలిస్టిక్ వే లో రాస్తున్నప్పుడు కచ్చితంగా అన్ని విషయాలను స్పృశించాలి కదా.. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిన విధానం సిల్లీగా అనిపించిన రాధాకృష్ణకు.. రేవంత్ రెడ్డి వ్యవహారం ఎందుకు తప్పుగా అనిపించలేదో ఆయనకే తెలియాలి.. అన్నట్టు నాడు జగన్మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిసినప్పుడు.. టికెట్ రేట్లు పెంచడానికి ఒప్పుకున్నప్పుడు అంకమ్మ శివాలు ఊగిన రాధాకృష్ణ.. ఇప్పుడు చప్పున చల్లారిపోవడం.. తప్పు మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమదే అన్నట్టు చెప్పడం నిజంగానే హాస్యాస్పదం.. నాడు తెలుగు చిత్ర పరిశ్రమ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు రాధాకృష్ణకు తప్పుగా అనిపిస్తే.. నేడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒప్పుగా అనిపించడం కాల మహిమ అనుకోవాలా? ఏమో దీనిని ఏం జర్నలిజం అంటారో శ్రీమాన్ వేమూరి రాధాకృష్ణే చెప్పాలి. అన్నట్టు టికెట్ రేట్ల గురించి.. బెనిఫిట్ షో ల గురించి నీతులు చెప్పిన రాధాకృష్ణ.. తన పేపర్ కవర్ ప్రైస్ గురించి.. ప్రతి మూడు నెలలకు మారే యాడ్ టారిఫ్ రేట్ల గురించి ఒక్క వాక్యమైనా రాస్తే బాగుండు.. ఇలాంటప్పుడే చెప్పడానికే నీతులు అనే సామెత గుర్తుకు వస్తే ఆ తప్పు ముమ్మాటికీ మాది కాదు.