Damagundam Navy Radar Station : దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని భారత రాష్ట్ర సమితి వ్యతిరేకిస్తోంది. 10 సంవత్సరాల తర్వాత ప్రజాసామిక హక్కులు, మానవ హక్కులు… ఇలా రకరకాల పదాలను తన మౌత్ పీస్ ద్వారా ప్రచారం చేస్తోంది. నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల హైదరాబాద్ కు ఆక్సిజన్ లభించదు. జనం బతికే అవకాశం లేదు. ఔషధ మొక్కలు చనిపోతాయి. లక్షల చెట్లు నేలమట్టమవుతాయి. జీవజాతులు కాలగర్భంలో కలిసిపోతాయి. అసలు మనిషి మనుగడ ప్రమాదంలో పడుతుందని ప్రచారం చేస్తోంది. కానీ తమిళనాడులో ఇదే తరహా నేవీ రాడార్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నిర్మాణం తో జరిగిన ఉపద్రవాలు ఏమిటో భారత రాష్ట్ర సమితి చెప్పదు. కేటీఆర్ చెప్పలేడు. కేసీఆర్ బదులు పలకలేడు. కానీ ఇక్కడ భారత రాష్ట్ర సమితి అసలు విషయాన్ని మర్చిపోతోంది. నేవీ అనేది మన దేశ రక్షణ వ్యవస్థ. అది చైనా సంస్థ కాదు, పాకిస్తాన్ అనుకూల సంస్థ కాదు. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి 2,900 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో 1,500 ఎకరాలను గ్రీన్ బెల్ట్ గా ఉంచుకుంటుంది. 1400 ఎకరాలలో చెట్లను మొత్తం కూల్చివేయదు. తనకు అవసరమైన చోట చెట్లను తొలగించి.. ఇతర ప్రాంతాల్లో ట్రాన్స్ లోకేట్ చేస్తుంది. స్థూలంగా కొత్త ఏరియాలో చెట్లను పెంచుతుంది. 2,900 ఎకరాల్లో ఒకటి పాయింట్ 1.95 లక్షల చెట్లు ఉన్నాయి. అలాంటప్పుడు లక్షల కొద్ది చెట్లను నరికి వేస్తారని భారత రాష్ట్ర సమితి మౌత్ పీస్, ఇంకా కొంతమంది ఆరోపిస్తున్నారు.. భవనాల నిర్మాణం కోసం అవసరమైన స్థలంలో కొన్ని వేల చెట్లను తొలగిస్తారు. అయితే వాటిని ట్రాన్స్ లొకేట్ చేస్తారు. అంతేతప్ప వాటిని పూర్తిగా చంపరు.
భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తున్నట్టు.. ఇంకా కొంతమంది విమర్శిస్తున్నట్టు.. అది అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టు అయితే.. కేంద్రం ఎందుకు అనుమతిస్తుంది.. అయితే ఈ స్పృహ భారత రాష్ట్ర సమితికి లేకుండా పోయింది. పైగా అది ఒక సెక్షన్ వ్యక్తులతో కలిసి గొంతు కలపడమే అసలైన భావ దారిద్రం. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పు చేస్తోంది. గతంలో భారత రాష్ట్ర సమితి చేసింది కాబట్టే.. మేము కొనసాగిస్తున్నామని సమర్థించుకుంటున్నది. “దేశ రక్షణే మా తొలి ప్రాధాన్యం. ప్రభుత్వం అంటేనే కొనసాగింపు ప్రక్రియ. మాకు విజ్ఞత ఉంది. కాబట్టి మేము కేంద్రానికి సహకరిస్తున్నామని” అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం లేదు. చెప్పుకోవడం లేదు.
నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల దామగుండం రూపురేఖలు మారుతాయి. కొత్తగా బ్యాంకులు, ఆస్పత్రులు, ఇంకా అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు రాడార్ నుంచి లో ఫ్రీక్వెన్సీ లో రేడియేషన్ వస్తుంది. అది మనుషుల ఆరోగ్యాలపై అంతగా ప్రభావం చూపించదు. స్థూలంగా చెప్పాలంటే పటాన్చెరువును నాశనం చేస్తున్న కర్మాగారాల కంటే.. చెరువులను కలుషితం చేస్తున్న ఫ్యాక్టరీల కంటే ఈ రాడార్ స్టేషన్ కలిగించే నష్టం అత్యంత స్వల్పం.