HomeతెలంగాణMalkajgiri: మల్కాజ్ గిరిలో పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యేనా? నిజమేనా?

Malkajgiri: మల్కాజ్ గిరిలో పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యేనా? నిజమేనా?

Malkajgiri: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అధికారాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 వరకు పార్లమెంటు స్థానాలను గెలుచుకొని.. తమ గెలుపు గాలివాటం కాదు.. ప్రజల ఆశీర్వాదం బలమని నిరూపించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలు మినహా మిగతా అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన మల్కాజ్ గిరి స్థానం కూడా ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు స్థానంగా మల్కాజ్ గిరి పేరుపొందింది. అంతేకాదు 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీలో ఓడిపోయిన రేవంత్ రెడ్డికి 2019లో మల్కాజ్ గిరి రాజకీయంగా పునర్జన్మ ఇచ్చింది. ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించింది.

ఈ స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ తరఫు నుంచి సునీతా మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అంతకుముందు ఈమె వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ గా పని చేశారు. ఈమె భర్త మహేందర్ రెడ్డి మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు.. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.. ఈ స్థానంలో గెలవడం ఈటల రాజేందర్ కు అత్యంత అవసరం.. పైగా జాతీయ నాయకత్వం కూడా ఈయన గెలుపుపై అత్యంత నమ్మకంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.. భారత రాష్ట్ర సమితి తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. బరిలో ముగ్గురు హేమాహేమీలు ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది.

అయితే రాగిడి లక్ష్మారెడ్డి తరఫున మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం భారత రాష్ట్ర సమితి కార్యకర్తలతో నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంలో పోటీ బిజెపి, భారత రాష్ట్ర సమితి మధ్యనే ఉందని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టారని.. అలాంటప్పుడు ఆమెకు ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. రాగిడి లక్ష్మారెడ్డి సేవా కార్యక్రమాల ద్వారా మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం ప్రజలకు సుపరిచితులని.. ఆయనను గెలిపించుకోవలసిన అవసరం ప్రజల మీద ఉందని అన్నారు. “కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని పోటీల్లో నిలబెట్టింది. చేవెళ్లలో తిరస్కరిస్తే ఆమెను ఇక్కడ నిలబెట్టారు. ఇక్కడ ఆమెతో మనకు పోటీ లేదు. ఈ ప్రాంతానికి చెందిన మల్లారెడ్డిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆయన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. తన నియోజకవర్గ పరిధిలో పదికి పది మున్సిపాలిటీలను భారత రాష్ట్ర సమితి గెలుచుకునేలా చేశారు. అంతటి కమిట్మెంట్ లక్ష్మారెడ్డి విషయంలోనూ చూపాలి. లక్ష్మారెడ్డి ని గెలిపించి భారత రాష్ట్ర సమితి సత్తా ఏమిటో కాంగ్రెస్ పార్టీకి అర్థమయ్యేలా చెప్పాలి”అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular