KTR to change: రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద విమర్శలు చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే.. తర్కం లేకుండా విమర్శలు చేస్తే.. అది మొదటికే మోసం తెస్తుంది. ఇది భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు వాస్తవంలోకి వచ్చింది. ఇప్పటికైనా ఆయన మారతారా? అదే ధోరణి కొనసాగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.
భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ పార్టీ మీద పూర్తిస్థాయిలో పట్టు కలిగి ఉన్నారు.. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని పటిష్టం చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు వచ్చిన తర్వాత కేటీఆర్ పార్టీని మరింత శక్తివంతం చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి కేటీఆర్ చేస్తున్న ఈ పని అభినందించదగ్గది. కానీ పార్టీని అభివృద్ధి చేసే వరకు ఆయన ఆగిపోతే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవడం వరకు ఆయన ఉండిపోతే ఇంతటి చర్చ సాగేది కాదు. కానీ కొన్ని సందర్భాలలో ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు.. ఇదే సమయంలో తర్కం లేని విమర్శలు చేస్తున్నారు. అవి కాస్త ఆయనను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
సరిగ్గా ఏడాది క్రితం వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫునుంచి అభ్యర్థిగా రాకేష్ రెడ్డి పోటీ చేశారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. వాస్తవానికి రాకేష్ రెడ్డి తరఫున కేటీఆర్ ప్రచారం చేసే సమయంలో.. అనుకోకుండా పల్లీ బఠాణి వర్సెస్ పిట్స్ పిలాని అనే విమర్శ చేశారు. తీన్మార్ మల్లన్న పల్లీ బఠాణి లాంటివాడని.. పెద్దగా చదువుకోలేదని అటువంటి వ్యక్తికి ఓటు ఎలా విస్తారంటూ కేటీఆర్ ప్రతి సభలోను విమర్శించారు. కేటీఆర్ చేసిన ఆ విమర్శ ను తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ల లోకి బలంగా తీసుకుపోయారు. అంతేకాదు, తాను బీసీ కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి.. ఇలాంటి విమర్శలు చేస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు.. కేటీఆర్ చేసిన ఆ ఆరోపణ తీన్మార్ మల్లన్న విజయానికి కారణమైంది.
ఇక ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పదేపదే నవీన్ యాదవ్ ను కేటీఆర్ ఆకు రౌడీ అని సంబోధించారు. దీంతో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తెరపైకి వచ్చారు. కల్వకుంట్ల కవిత వివాహం జరుగుతున్నప్పుడు తాను కేసీఆర్ కు ఆర్థిక సహాయం చేశారని.. దమ్ముంటే దీనిమీద చర్చకు కావాలని శ్రీశైలం యాదవ్ సవాల్ విసిరారు. తాను బీసీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి.. ఆకు రౌడీ అని సంబోధిస్తున్నారని నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారు.. మరోవైపు సల్మాన్ అనే వ్యక్తిని కేటీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. అతని మీద విపరీతమైన కేసులు ఉన్నాయి. అవి కూడా గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నమోదు చేసినవే.. అలాంటప్పుడు కేసులు ఉన్న వ్యక్తిని తన పార్టీలో చేర్చుకొని గొప్పగా ప్రచారం చేసుకున్న కేటీఆర్.. నవీన్ యాదవ్ ను రౌడీ అని సంబోధించడం జనాల్లో చర్చకు కారణమైంది. తద్వారా ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడానికి బీజం వేసింది. రైమింగ్ బాగుందని.. ప్రాస అదిరిపోయిందని ఎలా పడితే అలా విమర్శలు చేస్తే అంతిమంగా అభాసు పాలు కావాల్సింది పెద్ద నాయకులే. కేటీఆర్ లాంటి స్థాయి వ్యక్తి నుంచి ఇలాంటి చవక బారు విమర్శలను జనం ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇలాంటి విమర్శలను జనం పట్టించుకోరు. ఇప్పటికైనా కేటీఆర్ మారాలి. మార్చుకోవాలి.