https://oktelugu.com/

Telangana Congress: అరువు తెచ్చుకున్న బీఆర్ఎస్ వాళ్లతో కాంగ్రెస్ కు గెలుపు సాధ్యమేనా?

ఉదాహరణకు కడియం కావ్య తీసుకుంటే.. కడియం కావ్యను భారత రాష్ట్ర సమితి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య వంటి వారు ముందుకు వచ్చారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 2, 2024 / 06:50 PM IST

    Telangana Congress

    Follow us on

    Telangana Congress: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బలమైన అభ్యర్థులే లేరా? ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి.. కేసులు ఎదుర్కొని.. జైలు పాలైన నాయకులు పనికిరాని వారయ్యారా? ఉదయం లేస్తే విమర్శలు చేసే భారత రాష్ట్ర సమితి లోని నాయకులే బలమైన వారిగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్నారా? అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తుంది.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న రాజకీయాలు పై ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. ఉదాహరణకు చేవెళ్ల స్థానంలో అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చిన సునీత మహేందర్ రెడ్డి కి టికెట్ కేటాయించారు. తర్వాత రంజిత్ రెడ్డి చేరగానే ఆయనకు చేవెళ్ల స్థానం అప్పగించి.. సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్ గిరి పంపించారు. అటు సునీత, ఇటు రంజిత్ ఇద్దరు కూడా భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చినవారే. ఇక వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ప్రకటించిన కడియం కావ్య కూడా భారత రాష్ట్ర సమితికి చెందినవారే. ఆమె తండ్రి కడియం శ్రీహరి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనప్పటికీ తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఆయన భారత రాష్ట్ర సమితిని వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

    ఉదాహరణకు కడియం కావ్య తీసుకుంటే.. కడియం కావ్యను భారత రాష్ట్ర సమితి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య వంటి వారు ముందుకు వచ్చారు. ఆమె తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ లోగానే కావ్యకు కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వరంగల్ స్థానంలో అవకాశం ఇస్తామని ప్రకటించింది. దీంతో శ్రీహరి పునరాలోచనలో పడ్డారు. ఓడిపోయే పార్టీలో పోటీ చేసే కంటే.. గెలిచే పార్టీ ద్వారా తన బిడ్డ రాజకీయ ప్రవేశం చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఒక రకంగా ఈ పరిణామం కడియం కావ్యకు మంచిదే. ఇది ఆమెకు లభించిన ఆయాచిత వరం. చాలా కాలం భారత రాష్ట్ర సమితిలో కొనసాగిన శ్రీహరి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు. అయితే ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ బేలతనాన్ని సూచిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటికీ వరంగల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని నిలబెట్టలేని స్థితిలో కూరుకుపోయింది. అంతేకాదు వరంగల్ పార్లమెంట్ పరిధిలో కడియం శ్రీహరికి గట్టిపట్టు ఉందని కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామం ద్వారా అంగీకరించినట్టయింది. ఇదే సమయంలో తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేసే ప్రక్రియలో.. అందులోని నాయకులకే ఆ పెత్తనం అప్పగించడం కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులకు జీర్ణం కావడం లేదు.

    అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచే నాయకులు లేరా.. ఇన్నాళ్లు పార్టీ జెండా మోసిన వారు పోటీ చేయడానికి పనికిరారా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ బలం పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి తగ్గిపోయిందా.. అనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదు. కీలక నాయకులు చేరికలపై స్పష్టమైన మాట మాట్లాడటం లేదు. రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, సునీత మహేందర్ రెడ్డి, కడియం కావ్య వంటి వారు భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. నలుగురికి పిలిచి కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి సాధించిన విజయమా? లేక తనకు బలం లేదని ఒప్పుకోవడమా? సామాజిక శాస్త్రం ప్రకారం తాము బలంగా లేనప్పుడే ప్రత్యర్థులను బలహీనపరిచే మార్గాలను ఎన్నుకుంటారట. వంద రోజుల క్రితం శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి.. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బలం తగ్గిందా? ఇలాంటి పరిణామాలను ఎలా సమర్థించుకుంటారు? ఇప్పటివరకయితే నలుగురు భారత రాష్ట్ర సమితి నాయకులకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చింది. మరి కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అయినా కాంగ్రెస్ పార్టీ తన సొంత నాయకులను నిలబెడుతుందా? లేకుంటే జంప్ జిలానిలకు ఇస్తుందా? ఏమో ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.