Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన భూమిలేని పేదలకు ఏటా రూ12 వేల ఆర్థికసాయం అందిస్తామని2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఏడాది తర్వాత ఈ పథకాల అమలుపై కాంగ్రెస్ సర్కార్ దృష్టిపెట్టింది. రైతులకు ఎకరాకు రూ.15 వేలు కాకుండా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి 26నుంచి సాగుయోగ్యమైన భూమలన్నింటికీ పెట్టుబడి అందించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది అర్హులు ఉంటారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అంచనా వేశాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఆధారంగా ఆధారంగా ఇవ్వాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏటా రూ.1200 కోట్ల భారం..
రైతు కూలీలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.1,200 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో 29 లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ లెక్క తేల్చాయి. ఏడాదిలో కనీసంగా 20 రోజులైనా ఉపాధి హామీ పనులు చేసిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మంది కూలీలు 20 రోజులపాటు పనిచేసినట్లు ధ్రువీకరించారు. ఆ లెక్కన లబ్ధిదారులకు ఆర్థికసాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నిబంధనలు ఇవీ..
– ధరణి పోర్టల్‌లో తమ పేరుపై భూమి లేనివారు.
– ఉపాధి హామీ జాబ్‌కార్డు(Job card), బ్యాంకు అకౌంట్(Bank account) ఉండాలి.
– బ్యాంకు పాస్‌బుక్‌లకు ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి.
– 2023–24 ఆర్థికసంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి.
– గ్రామపంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకూడదు.
– ఈ అర్హతలు ఉన్నవారికి ఏడాదికి రూ.12 వేల ఆర్థికసాయం రూ.6 వేల చొప్పున రెండు విడతల్లో అందిస్తారు.
గ్రామసభల్లో తీర్మానం..
తెలంగాణలోని ప్రతీ గ్రామంలో జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. అందులో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను చదవి వినిపిస్తారు. అనంతరం అర్హుల తుది జాబితాను ఆమోదిస్తారు. సభలో ఎవరైనా అభ్యంతరాలు ఎదుర్కొంటే సంబంధిత ఎంపీడీవో వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తారు.
వారిలో ఆందోళన..
ఇదిలా ఉంటే.. ఆధార్(Adhar), జాబ్‌కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు అనుసంధానం కాని ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు. వాటిలో తప్పులు దొర్లిన ఉపాధి కూలీలు కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ తప్పులను ఈనెల 25వ తేదీలోపు సవరించుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు ఆదేశించారు. 6,92,921 మంది ఆధార్ కార్డుల్లో తప్పులు ఉండగా, జనవరి 12 వరకు 4,99,495 మంది కార్డులు సవరించారు. జాబ్ కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాల్లో నమోదైన తప్పులను కూడా సవరిస్తున్నారు. గడువులోగా ఈ సవరణ పూర్తవుతుందా లేదా అన్న ఆందోళన కూలీల్లో నెలకొంది.