India Today Survey: దేశంలో కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్రాల రాజకీయాల్లో పార్టీల బలబలాలపై ఇండియా టుడే మాంట్ సర్వే ఫలితాలు విడుదల చేసింది. జాతీయ, ప్రాంతీయ రాజకీయాల్లో ఆసక్తికర ట్రెండ్స్‌ను వెల్లడి చేసింది. బీఆర్‌ఎస్, వైసీపీలు బలహీనపడగా, జాతీయ పార్టీలు బలపడ్డాయి.
కొనసాగుతున్న మోదీ మ్యాజిక్..
సర్వే ప్రకారం బీజేపీ స్వతంత్రంగా 287 సీట్లు సాధిస్తుందని, ఎన్‌డీఏ మొత్తం 352 సీట్లకు చేరుతుందని అంచనా. ఇండియా కూటమి 182, కాంగ్రెస్ 80 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించింది. మోదీ విదేశాంగ, దేశభద్రతా విధానాలపై ప్రజలు ఇంకా నమ్మకంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ బలంగా కూటమి..
2024 ఎన్నికల్లో ఎన్‌డీఏ 21 సీట్లు సాధించగా, ఇప్పుడు 22–24 సీట్ల వరకు పెరిగే అవకాశం. వోటు శాతం 53–55%కి చేరింది. వైసీపీ 39–40%లో స్థిరపడి 1–3 సీట్లకు పడిపోతుందని తెలిపింది. కూటమి ఐక్యత, సూపర్ సిక్స్ పథకాలు కీలకంగా మారాయి. ఓటు బ్యాంకు ఇంకా బలంగా ఉన్నా, ఒంటరిగా కూటమిని ఎదుర్కొనే బలం లేకపోవడంతో వైసీపీ బలహీనపడిందని తెలిపింది. ఇక కాంగ్రెస్ ఏపీలో పెద్దగా పుంజుకోలేదని సర్వే సంస్థ అంచాన వేసింది.
తెలంగాణ బీఆర్‌ఎస్ గ్రాఫ్ డౌన్..
ఇక తెలంగాణలో అధికార ఓటు బ్యాంకు కాంగ్రెస్ 40.1% నుంచి 41%కి పెరిగింది. దీంతో అదనంగా 8 నుంచి 10 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఇక బీజేపీ ఓటు బ్యాంకు 35% నుంచి 33%కి తగ్గినా 7–8 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస ఓటు బ్యాంకు 16.6 నుంచి 18 శాతానికి పెరిగినా ఒక సీటు మాత్రమే వస్తుందని అంచనా వేసింది. తెలంగాణలో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్– బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని సర్వే సంస్థ అంచనా వేసింది. బైపోలార్ పోటీలో జాతీయ పార్టీలకు ప్రాధాన్యత, మోదీ మ్యాజిక్‌తో బీఆర్‌ఎస్ బలపడడం లేదని తెలుస్తోంది.
ఆంధ్రలో కూటమి ఐక్యత బీజేపీకి ప్లస్, తెలంగాణలో బీఆర్‌ఎస్ బలహీనత రెండు జాతీయ పార్టీలకు బలంగా మారింది. మోదీ క్రేజ్ బీజేపీ ఓటు బ్యాంకును కాపాడుతోంది. సర్వే జనాదరణను సూచిస్తుంది. అయితే ఎన్నికల నాటికి మార్పులు రావొచ్చు.