Drunk And Drive : కొత్త ఏడాదికి సంతోషంగా, ఆనందంగా స్వాగతం పలకాలని జీహెచ్‌ఎంసీ పోలీసులు సూచనలు చేస్తున్నారు. వేడుకలు విషాదానికి దారితీయొద్దని పేర్కొంటున్నారు. 2025 అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకల సంరద్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంటున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో విధించిన ఆంక్షల వివరాలను సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా నిఘా పెట్టామన్నారు. ఫామ్‌హౌస్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లపై దాడులు చేస్తామని తెలిపారు. ఏదైనా కేసులో ఇరుక్కుంటే జీవితం నాశనమని తెలిపారు. డ్రగ్స్ వినియోగం చేయకుండా చూడాలని సూచించారు. ఈ బాధ్యత ఈవెంట్ల నిర్వాహకులు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులదే అని స్పష్టం చేశారు. ఇక మద్యం సేవించి ఎవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి విస్తృతంగా డ్రంకన్‌డ్రైవ్‌ను నిర్వహిస్తామని తెలిపారు.
రాత్రి 8 గంటల నుంచే..
కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 31 రాత్రి 8:గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని తెలిపారు. డ్రగ్ డిటెక్షన్ టెస్టులు కూడా చేస్తామని పేర్కొన్నారు. తాగి వాహనాలు నడిపితే బండి సీజ్ చేయడంతోపాటు నడిపిన వారికి రూ.10 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు వివరించారు. అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే వేడుకలు నిర్వహించుకోవడానికి అనుమతి ఉందన్నారు. తర్వాత ఎవరూ బయట కనిపించొద్దని సూచించారు. ఆ తర్వాత కనిపించేవారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ మేరు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా ఆదేశాలు అందాయి.
ఒంటి గంట వరకూ మెట్రో..
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నిర్వహణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. చివరి ట్రిప్ 12:15 గంటలకు వివిధ స్లేషన్ల నుంచి రైళ్లు బయలుదేరుతాయని తెలిపింది. 1 గంట వరకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించింది. ఈమేరకు సెక్యూరిటీ వింగ్స్ మెట్రో స్లేషన్లు, మెట్రో రైళ్లలో నిఘా ముమ్మరం చేయనున్నట్లు వివరించింది. మద్యం తాగినవారు ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపింది.