Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారాగార వాసం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో అరెస్టు చేసింది. తర్వాత ఢిల్లీకి తరలించి ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. కోర్టు రిమాండ్ విధించడంతో నాలుగు నెలలుగా తీహార్ జైల్లో ఉంటుంది.
ఐదు నెలలు కావస్తున్నా..
కవిత అరెస్టై ఐదు నెలలు కావస్తున్న ఆమెకు ఇంతవరకు బెయిల్ దొరకలేదు. కవిత పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ప్రతీసారి దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వ్యతిరేకిస్తున్నాయి. చార్జిషీటు దాఖలు చేసినా కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టులకు విన్నవిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల వాదనలతో న్యాయమూర్తులు కూడా ఏకీభవిస్తున్నారు. దీంతో కవిత బెయిల్ ఆశలు ఆవిరవుతున్నాయి.
సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన..
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంతోపాటు, ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు పలుమార్లు పిటిషన్ వేశారు. ఇక్కడ నిరాశ ఎదురుకావడంతో ఈసారి సుప్రీంకోర్టు తలుపు తట్టే యోచనలో ఉన్నారు. తీహార్ జైల్లో కవితను కలిసి ఎందుకు వెళ్లిన కేటీఆర్, హరీశ్‌రావు ఈ మేరకు సూచనలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ పెద్దలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కేజ్రీవాల్‌తో మెలిక..
కవిత బెయిల్.. కేజ్రీవాల్ బెయిల్‌తో ముడిపడి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిన తర్వాతనే కవితకు బెయిల్ వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని న్యాయనిపుణులు చెబుతున్నమాట. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనకు కింది కోర్టు బెయిల్ ఇచ్చింది. దీనిని దర్యాప్తు సంస్థలు హైకోర్టులో సవాల్ చేశాయి. హైకోర్టు బెయిల్‌కు బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పోరాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వస్తే కవిత కూడా అదే మార్గం అనుసరించే అవకాశం ఉంది.
అప్రూవర్ గా మారితే..
లిక్కర్ స్కాంలో అప్రూవర్లుగా మారిన వారికి మాత్రమే ఇప్పటివరకు న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సిసోడియా అరెస్ట్ అయి ఏడాది దాటిపోయింది. అప్రూవర్‌గా మారకపోవడంతో ఆయనకు బెయిల్ రాలేదు. కవిత, కేజ్రీవాల్ కూడా అప్రూవర్‌గా మారడానికి అంగీకరించడం లేదు. దీంతో దర్యాప్తు సంస్థలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.