Mancherial: హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలని, వరదల నుంచి విముక్తి కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారు. రెండు నెలల క్రితం ఏర్పడిన హైడ్రా.. తనపని తాను చేసుకుంటూ పోతోంది. ఆక్రమణలను నేలమట్టం చేస్తోంది. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల సమయంలో వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటించడమే ఆలస్యం.. మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను పంపిస్తున్నారు. మొన్న ఖమ్మం, నిన్న సిద్దిపేట.. నేడు మంచిర్యాల జిల్లాల్లో హైడ్రా తరహా కూల్చివేతలు మొదలయ్యాయి. తాజాగా మంచిర్యాల కలెక్టరేట్‌కు సమీపంలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తున్న నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు భారీ బందోబస్తు నడుమ నేలమట్టం చేశారు. కోట్ల విలువైన భవనాన్ని నేలమట్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కొన్నాళ్లుగా విచారణ..
జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభత్వ భూమిలో ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 102.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, తప్పుడు సర్వే నంబర్లతో పత్రాలు సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టిస్తూ.. నిర్మాణాలు చేశారు. దీంతో ప్రభుత్వ స్థలం ఆక్రమణలపై కొంతకాలంగా అధికారులు విచారణ చేపడుతున్నారు. కార్మిక సంఘం నేత అయిన దీకొండ అంజయ్య 2013లో పానుగోటి ప్రేమలత నుంచి 350 గజాల స్థలం కొనుగోలు చేశాడు. అన్ని డాక్యుమెంట్లు చట్ట ప్రకారం ఉన్నాయంటూ నిర్మాణం చేపట్టాడు. అయితే నిర్మాణ సమయంలోనే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో 2021లో కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. దీంతో స్టే ఎత్తివేసింది.
మున్సిపల్ నుంచి అనుమతులు..
ఇదిలా ఉంటే.. భవన యజమాని ఇంటి నిర్మాణ అనుమతికి నస్పూర్ మున్సిపల్ అధికారు లకు 2018లో దరఖాస్తు చేసుకోగా, 2021లో అనుమతి ఇచ్చారు. అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారి భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఆ మేరకు చార్జీలు వసూలు చెల్లించారు. అనుమతుల ప్రకారం ఐదు అంతస్తుల భవనం నిర్మాంచాడు. కానీ రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ స్థలం అని అభ్యంతరం తెలిపారు. రాజకీయ ఒత్తిడితో చర్యలు తీసుకోలేదు. తాజాగా కోర్టు స్టే ఎత్తివయడం, బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడంతో అధికారులు భవనం నేలమట్టం చేశారు.
హైడ్రా వచ్చిందన్న చర్చ..
భారీ భవనం కూల్చివేత జిల్లాలో చర్చనీయాంశమైంది. అనుమతులు ఉన్నా.. అక్రమ నిర్మాణం అని కూల్చివేయడంతో జిల్లాకూ హైడ్రా వచ్చిందన్న చర్చ జరుగుతోంది. దీంతో అక్రమ నిర్మాణదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే కూల్చివేతలు ఈ ఒక్కభవనంతోనే ఆగుతాయా లేక అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తారా అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More