Hyderabad: ఐటీ రంగంలో హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలుదుదీరిన ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్‌గా పనిచేసిన కేటీఆర్.. ఐటీ సేవలు, సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో హైదరాబాద్‌ను పరుగులు పెట్టించారు. ఆయన చొరవతోనే దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు తెరిచాయనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణలోని చిన్న నగరాలలో కూడా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు. ఐటీ టవర్స్ నిర్మించారు. ఇలా ఐటీరంగం తెలంగాణ వ్యాప్తమైంది. కాంగ్రెస్ కూడా పదేళ్ల సంప్రదాయాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ టెక్కీలను సంతోషపరిచే వార్త ఒకటి ఉంది. టెక్ జీతాల పరంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలను అధిగమించిందని టీమ్‌లీజ్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. వేతనాల పరంగా టెక్కీలకు దేశంలో హైదరాబాద్ నగరం అత్యధిక మెుత్తాలను అందుకుంటున్న నగరంగా అవతరించిందని డిజిటల్ స్కిల్స్ – శాలరీ ప్రైమర్ ఫర్ ఎఫ్‌వై–2025 నివేదిక వెల్లడించింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ రంగంలో ప్రతిభ డిమాండ్, నైపుణ్య ప్రాధాన్యతలు, జీతం పోకడలపై నివేదిక కీలక విషయాలను వెల్లడించింది.
హైదరాబాద్ కంపెనీల్లో డిమాండ్..
ఇదిలా ఉంటే.. ఐటీ కంపెనీలన్నీ ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. కానీ, హైదరాబాద్ నగరంలోని టెక్ కంపెనీల్లో అత్యధిక డిమాండ్ కలిగిన రోల్స్ గురించి నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. టెక్ కంపెనీల్లో ప్రొడక్ట్ మేనేజర్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ వంటి పాత్రల్లో పనిచేస్తున్న టెక్కీల వేతనాలు ఏడాది ప్రాతిపదికన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. దేశంలోని ఇతర నగరాలతో పోటీగా వేతనాలను అందిస్తున్నాయి. హైదరాబాదులోని టెక్ కంపెనీల్లో ప్రొడక్ట్ మేనేజర్లుగా పనిచేస్తున్న టెక్కీలు సగటున రూ.21.1 లక్షల వార్షిక వేతనాన్ని అందుకుంటుండగా, డేటా సైంటిస్టులు దాదాపు రూ.16.1 లక్షల వార్షిక ప్యాకేజీని అందుకుంటున్నట్లు టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక వెల్లడించింది. వాస్తవానికి ఇవి టెక్ పరిశ్రమలోని టాప్–3 నగరాల్లో పొందుతున్న అత్యధిక వేతన స్థాయిలను హైదరాబాద్ అందుకుందని వెల్లడిస్తోంది.
ఈ మూడు రంగాల్లో పెట్టుబడి..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా 2024 ఆర్థిక సంవత్సరంలో 254 బిలియన్ డాలర్లు విలువ కలిగిన భారతదేశ టెక్ మార్కెట్ భారీ వృద్ధిని సాధిస్తోందని నివేదిక హైలైట్ చేస్తోంది. ఇంత భారీ స్థాయిలో వృద్ధి ఉన్నప్పటికీ.. టెక్ రంగంలో మారుతున్న టెక్నాలజీ అవసరాకు అనుగుణంగా మార్కెట్లో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత కంపెనీలకు పెద్ద అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేవలం 2.5% ఇంజనీర్లు మాత్రమే అఐలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఈ గ్యాప్‌ను పరిష్కరించేందుకు 86% కంపెనీలు తమ ఐటీ వర్క్‌ఫోర్స్‌ను రీ–స్కిల్ చేయడంపై దృష్టి సారిస్తున్నాయి.