Hyderabad City Police : హైదరాబాద్ మహానగరంలో షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వస్తువుల నుంచి మొదలుపెడితే దుస్తుల వరకు కొనుగోలు చేయడానికి చాలామంది మహిళలు వస్తుంటారు. ఇందులో రకరకాల వయసు వాళ్ళు ఉంటారు. దుస్తులు తమకు సరిపోయాయో లేదో చూసుకోవడానికి వారు ట్రయల్స్ రూమ్ కి వెళ్తుంటారు.. అయితే కొన్ని షాపింగ్ మాల్స్ లో ట్రయల్ రూమ్స్ లో దుర్మార్గులు సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటారు.. అందులోకి వెళ్లి దుస్తులు మార్చుకునే సమయంలో అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను సీక్రెట్ గా రికార్డ్ చేస్తుంటారు. ఆ దృశ్యాలను పెద్దల చిత్రాలు, అశ్లీల దృశ్యాలు ప్రదర్శించే సైట్ లకు విక్రయిస్తుంటారు. దీనివల్ల ఆ మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడమే కాకుండా, వారిపై చెడు అభిప్రాయం కలిగేలా చేస్తుంది. అయితే ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోవడం.. ఫిర్యాదులు కూడా ఎక్కువవడంతో హైదరాబాదు నగర పోలీసులు రంగంలోకి దిగారు. సీక్రెట్ కెమెరాల వ్యవహారానికి చెక్ పెట్టేందుకు “యాంటీ రెడ్ ఐ” ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు.
ఏం చేస్తారంటే
యాంటీ రెడ్ ఐ ఆపరేషన్ ద్వారా హైదరాబాద్ నగర పోలీసులు.. స్టార్ హోటల్స్, లాడ్జిలు, షాపింగ్ మాల్స్, పబ్బులు, హాస్టళ్లు, హాస్పిటళ్లలో ఎక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నా గుర్తిస్తారు. దీనికోసం ఏకంగా 2000 మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వీరంతా కూడా షీ టీమ్స్ తో కలిసి డిటెక్టర్ తో తనిఖీలు చేపడతారు. ఈ డిటెక్టర్ బగ్ ను గుర్తిస్తుంది. సీక్రెట్ కెమెరా ఎక్కడ ఏర్పాటు చేసిందో చెప్పేస్తుంది. ఇటీవల గుడివాడలోని ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు క్యాంపస్ లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఉదంతం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సంచలనం కలిగింది. ఆ తర్వాత గతంలో హైదరాబాదులోని స్టార్ హోటల్ లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి.. దృశ్యాలు చిత్రీకరిస్తున్న ఘటన కలకలం రేపింది. ఇవే కాదు సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం కేంద్రమంత్రి స్మృతి ఇరానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది. దీంతో నాటి నుంచి సీక్రెట్ కెమెరాల నిరోధానికి ఏకంగా ఒక ఉద్యమమే నడుస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో సీక్రెట్ కెమెరాలు అనేవి లేకుండా చేసేందుకు పోలీసులు యాంటీ రెడ్ ఐ అనే ఆపరేషన్ చేపడుతున్నారు. ఇది గనక విజయవంతం అయితే అమ్మాయిలకు అన్ని ప్రాంతాలు సేఫ్ గా ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్న నేపథ్యంలో మరింత వేగంగా ఆపరేషన్ నిర్వహిస్తామని పోలీసులు వివరిస్తున్నారు.