Revanth Reddy two-year rule: తెలంగాణ ఏర్పాటు తర్వాత.. రెండు పర్యాయాలు భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. రెండు సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. దీనికి తోడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించిన నేపథ్యంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలలో కొంతమంది భారత రాష్ట్ర సమితిలోకి వెళ్లిపోయారు. రెండు పర్యాయాలు కూడా ప్రతిపక్షం అనేదానిని లేకుండా చేయడంలో కేసీఆర్ విజయవంతమయ్యారు.
ఎప్పుడైతే ప్రదేష్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు రేవంత్ రెడ్డికి వచ్చాయో.. అప్పటినుంచి పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ పార్టీని తెరమీదకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి విజయవంతమయ్యారు. అదే కాదు 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో బలవంతుడైన కేసీఆర్ ను ఓడించారు. హ్యాట్రిక్ సీఎం కావాలని ఆయన కన్న కలలను కల్లలు చేశారు. తద్వారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొత్త ఒరవడికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. వాటికి ఆరు గ్యారెంటీలు అని పేరు పెట్టింది. ఇందులో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది ప్రభుత్వం. ఆ తర్వాత గృహ జ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా అమలు చేసింది. రైతులకు రెండు లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసింది. మహిళలకు ఇందిరమ్మ పేరుతో చీరలు మంజూరు చేసింది. వడ్డీ లేని రుణాలను కూడా మంజూరు చేస్తోంది. ఇవన్నీ కూడా మహిళల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం ఏర్పడేందుకు కారణమయ్యాయి.
ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టడానికి రేవంత్ ఏసీబీకి విస్పష్టమైన అధికారాలు ఇచ్చారు. అందువల్లే అవినీతి అధికారులు సులభంగా దొరికిపోతున్నారు. 2023 లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు అన్ని శాఖల్లో అధికారులు ఏసీబీకి దొరికిపోయారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కొంతమేరకు గ్రామీణ ప్రాంత ప్రజల స్థితిగతులను మార్చేస్తున్నాయి. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం ఉన్నందువల్లే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 70% స్థానాలను దక్కించుకుంది.
అయితే క్షేత్రస్థాయిలో ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై చర్యలు లేవు. కాలేశ్వరం నుంచి మొదలుపెడితే ఈ కార్ రేస్ వరకు ప్రతి దాంట్లోనూ అక్రమాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధుల సమీకరణ అంతగా చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మూసీ నది శుద్ధి.. హామీకే పరిమితం అయిపోయింది. ఫోర్త్ సిటీ ప్రకటనలు దాటి ముందుకు రావడం లేదు. అభివృద్ధికి నిధులు లభ్యత లేకపోవడంతో ప్రభుత్వం ఆణివార్యంగా భూములు అమ్ముకోవాల్సి వస్తోంది. అయితే కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. కంచన్బాగ్ భూముల విక్రయం కూడా ఒక రకంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం తీసుకొచ్చింది. హిల్ట్ పాలసీ మీద ప్రభుత్వ ఊహించని దుమారం చెదరేగింది. ఆరు గ్యారెంటీలలో ప్రధాన భాగమైన సామాజిక పింఛన్ల పెంపు, తుల బంగారం వంటి హామీ అటకెక్కింది. మరోవైపు ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్వహించిన తెలంగాణ రైసింగ్ ను ప్రభుత్వం గొప్పగా చేపట్టినప్పటికీ.. వాటి ఫలితాలను ఇప్పుడప్పుడే అంచనా వేయలేం.
గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. యూరియా లభించక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాన కాలంలో యూరియా కోసం పడి కాపులు కాచిన రైతులు.. యాసంగిలో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతుల కోసం యూరియా గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడేమో యాప్ లో బుక్ చేసుకోవాలని చెబుతోంది. అభివృద్ధి, రైతుల సంక్షేమం వంటి విషయాలను పక్కన పెడితే.. మిగతా వాటిల్లో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పర్వాలేదనే స్థాయిలోనే ఉంది. ప్రభుత్వం ఊహించని స్థాయిలో ఆదాయం రాకపోవడంతో అప్పులు తేవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. దీనికి తోడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ కావడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. మరో మూడు సంవత్సరాలు పదవి కాలం ఉన్న నేపథ్యంలో.. రేవంత్ ఈ సమస్యలను ఎలా ఎదుర్కొంటారు.. పై వచ్చే ఐదేళ్లు ఎలా ముఖ్యమంత్రి అవుతారు.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.