Balapur Laddu: హైదరాబాద్ నగరంలో అనేక ఐకానిక్ సింబల్స్ ఉంటాయి.. చార్మినార్ నుంచి మొదలు పెడితే దుర్గం కేబుల్ బ్రిడ్జి వరకు ప్రతిదీ అక్కడ అద్భుతమే. నవరాత్రి వేడుకల సమయంలో హైదరాబాద్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి.. బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యేకంగా నిలుస్తాయి. ఖైరతాబాద్ గణపతి ఎత్తులో రికార్డు సృష్టిస్తే.. బాలాపూర్ గణపతి లడ్డూ వేలంలో సరికొత్త ఘనతను అందుకుంటాడు. బాలాపూర్ గణపతికి విశేషమైన చరిత్ర ఉన్నది. లడ్డు విషయంలో కూడా స్వామివారికి అదే స్థాయిలో ఘనత ఉన్నది.
బాలాపూర్ లడ్డు ను శనివారం వేలం వేశారు. ఈసారి రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గత ఏడాది 30.01 లక్షల ధర లభించగా.. ఈసారి ఏకంగా 35 లక్షలకు చేరుకుంది.. కర్మాన్ ఘట్ ప్రాంతాన్ని చెందిన లింగాల దశరథ్ గౌడ్ దీనిని దక్కించుకున్నారు. బాలాపూర్ ప్రాంతంలో 1994లో తొలిసారిగా లడ్డును వేలం వేశారు. అప్పుడు ఓ వ్యక్తి 450 రూపాయలకు దక్కించుకున్నారు. అప్పట్లో ఆ ధర రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఏకంగా లక్షల లోకి చేరుకుంది. ఈసారి వేలంపాటలో 38 మంది పాల్గొనడం విశేషం.
పోటాపోటీగా..
వేలంలో పోటాపోటీగా వ్యక్తులు పాల్గొనడంతో ధర ఆకాశాన్ని అంటింది. ఒకానొక దశలో 50 లక్షల వరకు చేరుకుంటుంది అనుకున్నప్పటికీ.. మధ్యలో కొంతమంది డ్రాప్ కావడంతో ధర 35 లక్షలకు ఖరార్ అయింది. దీంతో దశరథ్ గౌడ్ లడ్డూను సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడ గణపతి లడ్డు విశిష్టమైనదని.. రకరకాల పనుల్లో వాడితే ప్రయోజనం దక్కుతుందని చాలామంది భావిస్తుంటారు. అందువల్లే ఈ లడ్డును వేలంలో కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు.. బాలాపూర్ లడ్డు కంటే రిచ్ మండ్ విల్లా, రాయదుర్గం మై హోమ్ భుజ గణపతి లడ్డూలు భారీ ధర సొంతం చేసుకున్నాయి. వాటితో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో గణపతి చేతిలో ఉన్న ప్రసాదం తక్కువ ధర పలికినప్పటికీ.. గత రికార్డును బద్దలు కొట్టింది. లడ్డును దక్కించుకున్న దశరథ గౌడ్ మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటుచేసిన స్వామివారి చేతిలో ప్రసాదం ఎంతో ప్రాశస్త్యమైనదని.. అందువల్లే సొంతం చేసుకోవాల్సి వచ్చిందని.. దీనిని వివిధ వ్యాపారాలలో వాడతానని ఆయన పేర్కొన్నాడు.