
YS Sharmila- Hijras: తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తెస్తానంటూ రాజకీయం చేస్తున్నారు. వైఎస్.షర్మిల. పాదయాత్ర ద్వారా తెలంగాణను చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవ ఆమె వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యతో హిజ్రాలు సైతం మండిపడుతున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కొజ్జా అన్నందుకే..
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల ఆరోపణలు చేయడం, ఆ తర్వాత బీఆర్‌ఎస్ నేతలు షర్మిల బస్సుకు నిప్పుపెట్టడం తదితర పరిణామాలతో సుమారు రెండు నెలలపాటు షర్మిల పాదయాత్రి నిలిచిపోయింది. ఇటీవలే కోర్టు, పోలీసుల అనుమతితో నర్సంపేట నియోజకవర్గం నుంచే యాత్ర మొదలు పెట్టారు. మహబూబాబాద్ పాదయాత్రలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను కొజ్జా అంటూ ఘాటుగా వ్యాక్యానించారు. శంకర్ నాయక్ తనను శిఖండి అని కొజ్జా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడిన షర్మిల ఎవడ్రా కొజ్జా.. హామీలు అమలు చేయని నువ్వు కదా కొజ్జా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతు రుణమాఫీ చేయని మిమ్మల్ని కొజ్జాలు కాకుండా మరేమంటారు అని ప్రశ్నించారు. ఆరు నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాకపోతే మరేమవుతారు అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
షర్మిల వ్యాఖ్యలతో హిజ్రాల ఆందోళన..
షర్మిల శంకర్‌నాయక్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో వరంగల్‌లో హిజ్రాలు ఆందోళన చేశారు. షర్మిల ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి దహనం చేశారు. షర్మిల తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిల డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంతో స్థానికంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.
తక్కువచేసి మాట్లాడితే ఊరుకోం..
హిజ్రాలను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని, హిజ్రాలలో చదువుకున్న వారు, విద్యావంతులు, మేధావులు ఎందరో ఉన్నారని, హిజ్రాలు నేడు సమాజంలో మిగతా కమ్యూనిటీలలానే గౌరవప్రదంగా జీవిస్తున్నారని హిజ్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లైలా పేర్కొన్నారు. హిజ్రాల గురించి మాట్లాడేటప్పుడు వారి జీవితం ఏంటో వారితో కలిసి ఉండి తెలుసుకోవాలని, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయ నాయకులు తమ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడొద్దని సూచించారు. షర్మిల తమకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పాదయాత్ర అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికే వైఎస్.షర్మిల పాదయాత్రకు బీఆర్‌ఎస్ నాయకుల నుంచి హెచ్చరికలు వస్తుండగా, ప్రస్తుతం హిజ్రాలు కూడా షర్మిల చేస్తున్న వ్యాఖ్యల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల పాదయాత్రలో ముందుకు వెళ్లగలుగుతారా అన్నది తెలియాల్సి ఉంది. కొంతమంది హిజ్రాలతో ఎందుకు పెట్టుకున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.