https://oktelugu.com/

ABN – Maha TV : ఏబీఎన్, మహాటీవీలపై హైకోర్టు ఆగ్రహం

టీవీ ఛానళ్లలో జరిగిన చర్చ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. దీనిపై చర్య తీసుకోవాలా? వద్దా? అనేది హైకోర్టు నిర్ణయిస్తుందని చెప్పారు.

Written By: , Updated On : May 31, 2023 / 05:20 PM IST
Follow us on

ABN – Maha TV : మీడియా ఛానళ్ల తీరుపై తెలంగాణ కోర్టు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన వెకేషన్ బెంచ్ మీడియా ఛానళ్లలో జరిగిన డిబేట్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటికి సంబంధించి రికార్డులను, వీడియో పుటేజీలను తన ముందు ఉంచాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డి విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వ్యతిరేక కథనాలను ప్రచురించింది. కొన్నిరకాల డిబేట్లు ఏర్పాటుచేసింది. అవినాష్ అరెస్టుల నుంచి తప్పించుకుంటున్నారని.. న్యాయస్థానాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ డిబేట్ లో పాల్గొన్న కొందరు జడ్జిలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది.

ఈ నెల 26న హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసింది. 31 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా టీవీ ఛానళ్లలో ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. డిబేట్లలో న్యాయమూర్తుల మీద అవినీతి ఆరోపణలు చేసి సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ పాల్గొన్నారు. అవినాష్ కేసు విషయంలో హైకోర్టు జడ్జీలకు డబ్బు సంచులు వెళ్లాయని… అందుకే అయన అరెస్ట్ కావడం లేదని  రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఇదంతా సదరు ఛానళ్లలో ప్రసారమయ్యింది. దీనిని హైకోర్టు సీరియస్ తీసుకుంది. ఈ రోజు అవినాష్ ముందస్తు బెయిల్ పై తీర్పు వెలువరించే క్రమంలో న్యాయమూర్తి  లక్ష్మణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ డిబేట్ వీడియోలను కోర్టు ముందు ఉంచాలని  హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించారు.

ఆ రోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ లో జరిగిన ఈ డిబేట్ లో బిజెపి నాయకుడు విల్సన్ ,మాజీ జడ్జి రామకృష్ణ పాల్గొన్నారు. చర్చను జర్నలిస్ట్ పర్వతనేని వెంకట కృష్ణ నిర్వహించారు.  చర్చ కొనసాగుతుండగా రామక్రిష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు.  మహాటీవీలోనూ ఇదే చర్చ పెట్టి చర్చించారు.  అవినాష్ ఎపిసోడ్ తరువాత ఈ సెక్షన్ ఆఫ్ మీడియాకు అదే ప్రాధాన్యతాంశంగా మారిపోయింది. నిజానికి ఈ రోజు  కేసులో సీబీఐ కి అనుకూలంగా కోర్టులు ఉత్తర్వులు ఇస్తే న్యాయమూర్తులు గొప్పగా వ్యవహరించారని… నిందితులకు సరైన గుణపాఠం తప్పదని ఇవే ఛానళ్లు గంటల కొద్దీ చర్చలు జరిపేవి. కానీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది.

వాస్తవానికి ఈ రెండు ఛానెళ్లలో డిబేట్లు నడిపింది సీనియర్ జర్నలిస్టులు. కోర్టుల మీద వ్యాఖ్యానించడం నిబంధనలకు విరుద్ధమని వారికి తెలియదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ రోజు కేసులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు తమ బాధను వ్యక్తం చేశారు. మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్ఛకు మేం అడ్డంకి కాదు. కానీ కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. ఒక స్థాయిలో విచారణ నుంచి తప్పుకోవాలని భావించాను. కానీ సుప్రీం ఆదేశాలు పవిత్రమైన న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో విచారణ కొనసాగించాను. న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. టీవీ ఛానళ్లలో జరిగిన చర్చ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. దీనిపై చర్య తీసుకోవాలా? వద్దా? అనేది హైకోర్టు నిర్ణయిస్తుందని చెప్పారు. దీంతో ఈ కేసు ఎటు తిరుగుతుందా? అన్న చర్చ అయితే ఒకటి జరుగుతోంది. మీడియా మితిమీరి వ్యవహరిస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.